సూక్తిముక్తావళి;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఓ మనిషీ
గర్వపడితే
భంగపడతావు
ఒదిగియుంటే 
వృద్ధిలోకొస్తావు
ఆలోచించినడచుకోరా

ఓ మానవా
పరుగులెత్తితే
క్రిందపడతావు
కాళ్ళువిరిగితే
కష్టాలపాలవుతావు
నిదానమే ప్రదానమురా

ఓ మనుజుడా
అపకారాలుచేస్తే
శత్రుత్వంతెచ్చుకుంటావు
వీలుదొరికితే
ప్రతీకారంతీర్చుకుంటారు
అపకారికికూడా ఉపకారంచేయమన్నారురా

ఓ మానవుడా
దొంగతనాలుచేస్తే
అపఖ్యాతిమూటకట్టుకొంటావు
చిక్కావంటే 
శిక్షలుపడతాయి
నీతిబ్రతుకే మేటియని తెలుసుకోరా 

ఓ మనుజా
అబద్ధాలాడితే
చెడ్డముద్రవేస్తారు
నమ్మకంపోతే
దూరంగాపెడతారు
చివరకు సత్యమేజయిస్తుందిరా

ఓ నరుడా
అన్యాయాలుచేస్తే
చెడ్డపేరుతెచ్చుకుంటావు
అందరికితెలిస్తే
నిందలపాలవుతావు
న్యాయమార్గమే అనుసరణీయమురా

ఓ మానిషీ
అక్రమాలకు ఒడికడితే
దుష్ఫలితాలను అనుభవిస్తావు
ప్రచారంలోకొస్తే
దుర్మార్గుడంటారు
ఋజుప్రవర్తనే శ్రీరామరక్షరా

ఓ పారగతా
తప్పులుచేస్తే
తంతారు
వీలుదొరికితే
తగలబెడతారు
ఒప్పులకుప్పగా వాసిల్లురా

ఓ పంచజనా
గోతులుతీస్తే
గుంటలోపడతావు
అవకాశమొస్తే
సమాధిచేస్తారు
ఎవరుతీసినగోతిలో వారేపడతారురా

ఓ ద్విపాదుడా
గొప్పలకుపోతే
మునగచెట్టెక్కిస్తారు
కొమ్మవిరిగితే
క్రిందపడతావు
పొగడ్తలకు పొంగిపోకురా

ఓ మర్త్యుడా
సేవలుచేస్తే
పుణ్యమొస్తుంది
ఆర్తులకుసహాయపడితే
పేరువస్తుంది
మానవసేవే మాధవసేవరా

ఓ పుమాంసుడా
పూజలుచేస్తే
పరమాత్ముని అనుగ్రహంపొందుతావు
దేవునిదయగలిగితే
సుఖశాంతులతో వర్ధిల్లుతావు
సంసారసాగరాన్ని ఈదగలుగుతావురా

ఓ మనుష్యా
తోటివారిని ప్రేమిస్తే
అభిమానానురాగాలు పొందుతావు
అందరూమనవారనుకుంటే
ఆనందంగాజీవించగలవు
సమాజం బాగుపడుతుందిరా


కామెంట్‌లు