కేరళ వార్షిక పడవ పోటీలు;-- యామిజాల జగదీశ్
 చరిత్రతోనూ, పురాణాలతోనూ ముడిపడి ఉన్న సంప్రదాయాలలో ఒకటి  కేరళలోని  స్నేక్ బోట్ రేసింగ్. విశేష ఆదరణ కలిగిన ఈ స్నేక్ బోట్ పోటీలకు శతాబ్దాల చరిత్ర ఉంది. 
ఒకేసారి లక్షలాది మంది ప్రజలు ఈ  అద్భుతమైన పోటీలను తిలకిస్తుంటారు. ఈ పోటీలను క్లిక్కుమన్పించే ఫోటోగ్రాఫర్‌లు ఆద్యంతమూ కెమేరాలో ఈ అద్భుత దృశ్యాలను బంధిస్తూ ఉంటారు. 
Chembakassery చెంబకస్సేరి రాజు దేవనారాయణ 400 సంవత్సరాల క్రితం తన ప్రత్యర్థి రాజు కాయంకుళంపై యుద్ధంలో గెలవడానికిగాను వినూత్నరీతిలో ఓ పడవను నిర్మించడానికి  అత్యంత నైపుణ్యం కలిగిన ఓ వడ్రంగిని నియమిస్తాడు. 
ఈ రెండు రాజ్యాల సైన్యాలు తరచూ సముద్రజలాలలో యుద్ధం చేస్తుండేవి. కానీ బలహీనమైన నౌకాదళం కారణంగా దేవనారాయణ రాజు ఘోరంగా ఓడిపోతుండేవాడు. దాంతో లాభం లేదనుకున్న దేవనారాయణ కొత్త పడవను నిర్మించుకుంటాడు. ఈ వినూత్న పడవను వంద మంది సహాయకులతో కలిసి ప్రధాన వడ్రంగి నిర్మిస్తాడు. ఈ పడవతో యుద్ధానికి దిగిన దేవనారాయణ రాజు గెలుస్తాడు. పాము ఆకారంలో పొడవాటి ఈ పడవ అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రతీకారం తీర్చుకోవాలన్న రాజు కోరికలోంచి పుట్టిందే ఈ కొత్త తరహా పడవ. అప్పట్లో వివిధ  ప్రయోజనాల కోసం ఇలాంటి స్నేక్ బోట్లను నిర్మించేవారు.
పడవలలో ఇరుటుకుత్తి, వైపు చురులన్ అనేవి చాలా చిన్నవి. వీటిని సామాన్య ప్రజలు లేదా కూరగాయలు, ధాన్యాలను ఈ ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకు రవాణాకు ఉపయోగిస్తారు. 
చుండన్ పడవ రకాలలో అన్నింటికంటే పెద్దది. దృఢమైనది. 
మహిళా రోవర్ల కోసం కూడా ఓ పోటీని ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. 
అలప్పుయాలో నిర్వహించబడే చుండన్ బోట్ రేస్ భారతదేశంలోని దక్షిణ భాగంలో ప్రధానమైనది. ఈ పోటీలు అత్యధికమంది వీక్షించే క్రీడలలో ఒకటి! 
నాలుగు - ట్రాక్ రేసులో దాదాపు 15 - 20 ఇతర బోట్లను ఓడించిన తర్వాత నెహ్రూ ట్రోఫీని విజేత జట్టుకు ప్రదానం చేస్తారు.
ప్రతి పడవలో దాదాపు 110 మంది  ఉంటారు. అందరూ కలసికట్టుగా వీలైనంత వేగంగా తమ పడవను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారు.
ఉత్సాహం, ప్రేరణ కోసం పోటీదారులు  పాటలు పాడతారు. ఇందుకు సంప్రదాయ బద్ధమైన వాయిద్యాలు ఉపయోగిస్తారు. 
కేరళలోని అరన్ముల, కుమరకోమ్, కొత్తపురంలలో పడవ పోటీలు ఉండవు కానీ చూపరులను తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. వీరు తమ పడవలను పల్లియోడం లేదా శ్రీకృష్ణుని పడవ అని పిలుస్తారు.
ఓనం పండుగ (ఆగస్టు - సెప్టెంబరు మధ్య) సందర్భంగా నిర్వహించే వార్షిక పడవ పందాలను విశేషమైనవిగా పరిగణిస్తారు.
ఈ పోటీలలో గెలిచిన వారికి మంచి విందు ఏర్పాటు చేస్తారు. అరవై నాలుగు రకాల వంటకాలతో సాగుతుందీ విందు.
400 ఏళ్ల తర్వాత కూడా ఈ పడవ పందాల సంప్రదాయం తన శోభను ఏమాత్రం కోల్పోలేదు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కలిసి ఈ పోటీలను వీక్షిస్తుండటం విశేషం. 






కామెంట్‌లు