సుప్రభాత కవిత ; -బృంద
ఆగమించిన భానునికి
ఎదురేగిన పాలమబ్బులు
ఒడలంతా కన్నులతో
దినకరుడికి స్వాగతం

గిరి శిఖరాల నిరీక్షణం
దినకర మయూఖ స్పర్శ కై
జలపాతాల జలజలల
నిగమ మంత్రాల పఠనం

మలయ సమీరాల
విహారాల సందడి
గిరుల గుండె సడులన్నీ
జగమంత నింపాలని.

పరవశించి పచ్చదనం
శిరసు వంచి చేసె వందనం
పురి విప్పిన నెమలి లాగా
పరిమళించే సుమవనం

పంట చేల వయ్యారపు
కదలికల నాట్యాలు
కంటికింపుగా శోభ తెచ్చె
కమనీయ దృశ్యాలు

మింట వెలుగుల కాంతి చూసి
కంటి వెలుగుల హారతిచ్చి
ప్రభువు రాకకై ప్రకృతి సమస్తం
కేరింతలతో పలికె 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు