ద్రాక్షారామం క్షేత్రం ;-: సి.హెచ్.ప్రతాప్

 ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన గ్రామము ఇది కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలోని రాజమహేంద్ర వరం నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది ద్రాక్షారామం చూడదగ్గ ప్రదేశం ఇది మండల కేంద్రమైన రామచంద్రాపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది . ద్రాక్షారామం లో శ్రీ భీమేశ్వరుడు ఎనిమిది దిక్కుల్లో 108 శివలింగాలను స్వయంగా ప్రతిష్టించాడని విశ్వసించబడుతుంది
దక్షప్రజాపతి యజ్ఞం చేసిన ప్రాంతం ద్రాక్షారామం. తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిందని పురాణం కథనం.. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మిచినట్లు శిలాశానాల ద్వారా తెలుస్తోంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం ద్రాక్షారామం. ఈ క్షేత్రంలోని శివ లింగంభీమేశ్వర లింగంగా ప్రసిద్ధి. లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉంటుంది. రెండో అంతస్తులోని లింగానికి అభిషేకాదులు నిర్వహిస్తారు.
శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.
ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు. తూర్పున కోలంక, పడమర వెంటూరు, 'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి' వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.
ఈ ఆలయం చారిత్రక పరిశోధకులకు, చరిత్ర విద్యార్ధులకు ఒక గ్రంథాలయంగా ఉపయోగపడుతోంది. అడుగడుగునా శిల్పకళా నైపుణ్యం కానవచ్చే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తూ ఉంటారు.

కామెంట్‌లు