క్షీరారామ రామలింగేశ్వర క్షేత్రం; -:సి.హెచ్.ప్రతాప్
 దేవతలకు ,రాక్షసులకు జరిగిన యుద్ధం లో శ్రీ కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి వదించి అతని కంఠం లోని అమృత లింగాన్ని అయుదు ఖండాలుగా ఖండిస్తాడు. ఆ అయిదు అయిదు ప్రదేశాల్లో పడ్డాయి. అవే పంచారామాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ అయిదు క్షేత్రాలను ఒకే వరుసలో ముఖ్యంగా కార్తీక మాసంలో దర్శిస్తే జన్మ జన్మల పాపాలు పటాపంచలు అవుతాయన్నది అశేష భక్తజనం యొక్క అచంచల విశ్వాసం.
(1) అమరారామము (అమరావతి )
(2) సోమారామము (బీమవరం)
(3) క్షీరారామము (పాలకొల్లు )
(4) ద్రాక్షారామము (ద్రాక్షారామము )
(5) కుమారారామము (సామర్లకోట )
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీర రామం పాలకొల్లు పట్టణం లో వెలసింది . పశ్చిమ గోదావరి జిల్లా  పాలకొల్లు  గ్రామం లో శ్రీ రాముని చేత క్షీర కొలను పక్కన ప్రతిష్టించబడిన స్వామివారి లింగం శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి. పాలకొల్లు గ్రామము నరసాపురమునకు సుమారు 11 కి . మీ . దూరంలోను, భీమవరానికి 21 కి . మీ . దూరంలోనూ ఉంది తెల్లగా పాలవలె మెరిసే రెండున్నర అడుగుల ఎత్తున్న శివలింగం ఇక్కడ భక్తులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది . ఇక్కడ వెలసిన అమృత లింగాన్ని , బ్రహ్మాది దేవతలు వెంట రాగ శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రతిష్టించి శివుని కోరిక పై క్షేత్ర పాలకుడిగా లక్ష్మి సమేతుడై జనార్ధన స్వామి గ కొలువైనాడు .ఆది శంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యు పురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. శివలింగం పై భాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగం పైభాగమని విశ్వసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి
దేవాలయమునకు సమీపంలో రామగుండం అను కొలను వుంది. . ఈ కొలనులో నీరు తెల్లగా వుంటుంది.. అందుచేత పాలకొలను (క్షీరాపురం) అని ప్రసిద్ధి చెంది కాలక్రమంలో పాలకొల్లు గా మారింది . క్షీరారామం క్షేత్రం "ఆంధ్ర కైలాసం" గా పేరు పొందింది .
క్షీరారామ క్షేత్రమందు పార్వతీ పరమేశ్వరులు , లక్ష్మీ జనార్దనులు , సరస్వతీ బ్రమ్హాలు వేంచేసి ఉన్నారు . అందుచేత ఈ ఆలయము "త్రిమూర్త్యాలయము' గా ప్రాచుర్యం చెందినది . అంతేకాక, "హరి హర" క్షేత్రమని కూడా ప్రసిద్ధి చెందినది.
ఈ ఆలయంలో పూజలు స్మార్తశైవాగమ ప్రకారం జరుగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ దశమికి స్వామివారికి, పార్వతీదేవితో కల్యాణం జరుగుతుంది. మర్నాడు రథోత్సవం. శివరాత్రి సందర్భంలో స్వామివారు పార్వతీదేవితో రావణ వాహనంపై, శ్రీ లక్ష్మీజనార్ధనులు గరుడ వాహనంపై ఊరేగుతారు. అమ్మవారికి శరన్నవరాత్రులు ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు తరలివచ్చి, దర్శించి తరిస్తున్నారు. పట్టణ నడిబొడ్డులో వున్న ఆలయం రాజగోపురం కొన్ని మైళ్ళ దూరం వరకు నయన మనోహరంగా కన్పిస్తుంది. క్షీరారామ రామలింగేశ్వర దర్శనం సర్వపాప హరం సౌఖ్య ప్రదాయకం

కామెంట్‌లు