చక్రవర్తికి లేఖలు ; -రచన శ్రీమతి వేమరాజు సుభద్ర;-సమీక్ష :: Dr కందేపి రాణీ ప్రసాద్

 ఈ పుస్తకం 1956 వ సంవత్సరంలో ఆదర్శ గ్రంథం , విజయవాడ వారి ద్వారా ప్రచురింపబడింది . దీనిని రచించిన వారు శ్రీమతి వేమరాజు సుభద్ర గారు . ఈ లేఖలన్నింటినీ న్యాయపతి రాఘవరావు గారు బాలపత్రికలో నెలనెలా ప్రచురించారట . వీటిని రచయిత్రి తన మరిది కోసం రాసుకున్న లేఖలనీ , వాటిని చూసిన న్యాయపతి రాఘవరావుగారు “ మీ చక్రవర్తిలాంటి అల్లరి పిల్లలు ఆంధ్రదేశంలో అందరి ఇళ్లలోనూ ఉన్నారు . మీ మరిది కోసం తయారుచేసిన ' మంచిమందు ' ఒక్కొక్క మోతాదు వాళ్ళకు కూడా ఇప్పించి పుణ్యం కట్టుకోండి . ఇది ఇంతమందికి ఏకకాలంలో ఎలా అందుతుంది అన్న సందేహం మీకు అక్కర్లేదు . కావాలంటే మోతాదుతో పాటు అనుపాన క్రమమంతా నెలనెలా బాలలో ప్రకటిద్దాం " అని అన్నారని రచయిత్రి ఈ పుస్తకం ముందుమాటలో చెప్పారు . 
ఈ పుస్తకంలో పదహారు లేఖలున్నాయి . ఒక్కో లేఖలో ఒక్కొక్క విశేషం చెప్పబడింది . మొదటి లేఖలో జలుబు , దగ్గు , రొంప వంటివి రాకుండా జాగ్రత్తపడాలనీ , ఒకవేళ వస్తే దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు . ఈ జబ్బులు మిగతావాళ్ళకి అంటకుండా దూరంగా ఉండాలని చెబుతూ దానికో కథ చెబుతూ దానికో కథ చెప్పారు . ఈ కథను వారి భర్త వేమరాజు భానుమూర్తి చెప్పారనీ అది శ్యాముల్ బట్లర్ అనే ఆయన రాసిన పుస్తకంలోనిదని రచయిత్రి చెప్పారు . ఈ కథలో ఎర్వాన్ ' అనే ఒక దేశం ఉంటుంది . ఆ దేశంలో ఎవరైనా జబ్బుపడితే ఆ దేశపు రాజు వాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తాడట . అయితే ఇలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు . ఇది రచయిత ఊహ మాత్రమే . కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఆసుపత్రులలో అంటువ్యాధులు వచ్చినవారి కోసం వేరే గది ఉంటుంది . ఆయా రోగగ్రస్థులను ఆ గదులలో ఉంచుతారు . మామూలు జనానికి దూరంగా వేరే గదిలో ఉండడం ఖైదీల లక్షణం కాబట్టి అలా చెప్పి ఉండవచ్చు . 
రెండవ లేఖలో శ్వాసకు సంబంధించి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చుకోవడం మంచిదని చెప్పారు . మూడవ లేఖలో వెలుతురు గురించి విశేషాలు చెప్పారు . ఉదయం , సాయంత్రం లేత ఎండలో షికారు తిరగడం మంచిదనీ , గాంధీ గారు అలాగే చేసేవారని చెప్పారు . ' ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ' అని మనకున్న మంత్రాలు సూర్యుడు ఆరోగ్యమిస్తాడు అని అర్థం చెప్తాయన్నారు . నాల్గవ లేఖలో పరిశుభ్రం గురించి చెప్పారు . ఉదయం , సాయంత్రం చక్కగా స్నానాలు చేయాలని ఉతికి శుభ్రం చేసిన దుస్తులు వేసుకోవాలనీ , డిప్తీరియా , కలరా , టైఫాయిడ్ , మశూచి మొదలగు వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలనీ వివరించారు . అందుకే మన పెద్దలు “ దేహమే దేవాలయం ” అని చెప్పారు . ఐదవ లేఖలో పిల్లలు గోళ్ళు కొరక కూడదని బోధించారు గోళ్ళను శుభ్రం చేయకపోతే మట్టి బాక్టీరియా నోట్లోకి వెళ్ళి జబ్బులు కలగచేస్తాయి . ఆరవలేఖలో తలలో పేలు , కురుపులు వంటివి శుభ్రం లేకపోతే వస్తాయని చెప్పారు . ఏడవ లేఖలో దంతాల శుభ్రం గురించి , ఎనిమిదో లేఖలో ఆహారం గురించీ , తొమ్మిదో లేఖలో నీరు ఎక్కువగా తాగాలనీ చెప్పారు . పదవలేఖలోకాలకృత్యాలు సరియైన సమయంలో తీర్చుకోవాలనీ , పదకొండవ లేఖలో కంటి జాగ్రత్తలు చెప్పారు ' సర్వేంద్రియానాం నయనం ప్రధానం ' కదా ! పన్నెండో లేఖలో చెవిలో గుబిలి తీయటానికి పిన్నీసులు , పుల్లలు పెట్టటం వలన కర్ణభేరి దెబ్బతింటుందని చెప్పారు . పదమూడవ లేఖలో వ్యాయామం ప్రాముఖ్యత గురించీ , పధ్నాలుగవ లేఖలో పరిశుభ్రమైన దుస్తులు వేసుకోవాలనీ చెప్పారు . పదిహేనవ లేఖలో విద్యార్థులు రోడ్డు దాటేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ వివరించారు . ఈ పదహారు లేఖల ద్వారా పిల్లలకు అవసరమయ్యే అన్ని విషయాలనూ చర్చించారు .
కామెంట్‌లు