*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0177)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*దేవతలు హిమవంతునకు ఉమారాధన గురించి చెప్పడం - ఉమను స్తుతించడం*
*నారదా! మేనకతో వివాహం అయిన తరువాత హిమవంతుడు తన ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు, ప్రజలు, దేవతలు అందరూ పెద్ద ఉత్సవము జరుపుకున్నారు. మేనకతో కలసి హిమవంతుడు వేద విహితంగా సంసార బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కొంత కాలం తరువాత విష్ణు, బ్రహ్మ నైన నేను, మిగిలిన దేవతా సమూహము, రుషులు, మునులు, దేవగురువుతో కలసి హిమవంతుని వద్దకు వెళ్ళాము. మా రాకను తెలుసుకుని హిమవంతుడు మాకు ఎదురు వచ్చి స్వాగత సత్కారాలు చేసి, సముచితమైన ఆసనాలు ఇచ్చి, మాకు తగు విడుదులు ఏర్పాటు చేసి, ఎంతో ఆదరణ చూపాడు. విష్ణు దేవుని కీర్తించిన తరువాత, "విష్ణు దేవా, మీరు మిగిలిన దేవతలు అందరూ ఒకేసారి నా యింటికి రావడం వలన నా భాగ్యము పండినది. నేను చేసిన పూజలు ఫలించాయి. మీరు ఏ మాత్రమూ ఆలోచిచకుండా నా నుండి జరగవలసిన పనిని వెంటనే తెలియజేయండి" అని ప్రార్థన చేసాడు.*
*అలా ప్రార్థన చేసిన హిమవంతుని తో దేవతలు అందరూ "హిమవంతా! జగదంబ అయిన ఉమ, సతీదేవి గా దక్షుని ఇంట పుట్టడం, తపస్సు చేసి రుద్రుని మెప్పించి వివాహము చేసుకోవడం, దక్షుని చేత అవమానింపబడి దక్ష యజ్ఞము లో ఆత్మాహుతి అవడం మనకందరకు తెలిసిన విషయమే. అలా దేహ త్యాగం చేసిన తరువాత సతీదేవి తన పరధమానికి వెళ్ళి అక్కడ నివాసము ఉంటోంది. ఆ జగదంబ మరల మీ ఇంట పుత్రికగా పుట్టడం వల్ల లోకాలకు మేలు కలుగుతుంది. దేవతా సమూహానికి కూడా మేలు అవుతుంది." అని చెప్పగానే పరమానందానికి లోనైన హిమవంతుడు, అంబ తన కుమార్తె గా పుట్టడానికి తాను ఏమి చేయాలో చెప్పమని తన సమ్మతిని తెలియ చేసాడు.*
*అప్పుడు, విష్ణు భగవానుడు, మిగిలిన దేవతలందరమూ, హిమవంతుని తో కలసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుని అంబా స్తుతి చేస్తూ, ఆ జగన్మాతను పరి పరి విధాల కీర్తిస్తూ ఉన్నాము. "అమ్మా, శివలోకంలో ఉన్న నీవే, లక్ష్మీ, సరస్వతీ, దుర్గా దేవివి. నీవే అందరకూ ఆరాధ్యవు. నీ చేతులు, చేతలు కళ్యాణకారకములు. మీరే శ్రద్ధ, మీరే ధృతి. గాయత్రి, సావిత్రి, సరస్వతి కూడా మీరే. ఈ చరాచర జగత్తు లో నిద్ర, ఆకలి, తృప్తి అన్నీ మీరే. పుణ్య కార్యక్రమాలు చేసే వారి వద్ద లక్ష్మీ దేవిగా, పాపపు పనులు చేసే వరి వద్ద జ్యేష్ఠా దేవిగా వుండేది కూడా మీరే. నిద్ర రూపమున జీవులకు అత్యంత సుఖానుభవమును పంచుతావు. ఇటువంటి నీకు మేము అందరమూ అనేక నమస్కారాలు చేస్తున్నాము. మమ్మల్ని కరుణించి మాయందు ప్రసన్నురాలవు అవు తల్లీ." అని ప్రార్థిస్తూ, ఆ తల్లి ప్రత్యక్ష దర్శనం కోరుతూ వేచి చూస్తున్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు