సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 సుద...సుధ 
  *****
సుద,సుధ ఈ రెండు పదాల్లో అల్ప, మహా ప్రాణ అక్షర మార్పుతోనే అనూహ్యంగా అర్థం మారడం భలే ఆనందంగా, ఆశ్చర్యంగా అంతకు మించి అద్భుతంగా అనిపిస్తుంది.
సుద--ఈ అల్ప ప్రాణాక్షర పదం  మనం  జీవితంలో ఎదగాల్సిన స్థాయిని సూచించే అద్భుతమైన పదం.
ఈ పదానికి అర్థాలు,నానార్థాలు ఒకసారి చూద్దాం...సుద అంటే కొన,కోన,అంచలము,అంచు,అంశువు,అగ్రము,అగ్రభాగము,మోవి, మౌళి, శిఖరము,శిఖి,మొన లాంటి అర్థాలు ఉన్నాయి.
జీవితంలో సుదను చేరాలంటే అంచెలంచెలుగా ఎదగాలి. అగ్రభాగాన నిలవాలి. సుధలా అందరికీ ప్రియమైన వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలి.
సుధ అంటే అందరికీ తెలిసిన అమృతము అనే అర్థం ఒక్కటే కాదు. ఇంకా ఏమేమి అర్థాలు ఉన్నాయో చూద్దాం.
సుధ అంటే అంటే మెఱపు,అధీర,తటిత్తు,సౌదామిని,వజ్రజ్వాల,క్షణప్రభ, ఆకాశగంగ,అనంత వాహిని,దివ్యనది, జాహ్నవి, సున్నము, అమృతము,దేవభోజనము,దేవాన్నము, మృత్యునాశము... ఇలా అనేక పర్యాయ,నానార్థాలు ఉన్నాయి.
అనంత వాహినిలా  పవిత్ర హృదయంతో ఈ లోకంలో ప్రవహిద్దాం. విద్వత్తు అనే విద్యుత్తుతో ఈ సమాజములో  మెరుద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు