"బుద్ధికిశిక్షణ";-ఎం బిందుమాధవి
 "మన పక్క నించి ఎవరైనా వెళుతుంటే చూసీ చూడనట్టు ఉండటం చాలా కష్టం! ఏదో ఒక వ్యాఖ్య చెయ్యకుండా అస్సలు ఉండం."
"మన ఊహలు..ఆలోచనలు జోడించి వారికి ఏవో ఒక లక్షణాలు ఆపాదించి..అది కరెక్టే అని మనతో మన పక్కనే ఉన్న వారిని నమ్మించటం కోసం... వారి గురించి మనకి తెలియని విషయాలు కూడా తెలిసినట్టు సాధికారంగా మాట్లాడతాం! అది ఒక మానవదౌర్బల్యం"
అని మా స్టాటిస్టిక్స్ లెక్చరర్ గారు ఒకసారి తన పాఠం PROBABILITY THEORY తో పాటు చెప్పారు.
మన వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉండచ్చో...అబద్ధం, ఊహ అంతకు రెట్టింపు ఉండచ్చు.
కాబట్టి అలా మనం చేసే తీర్మానాలు ఎప్పుడూ ,కరెక్టే ఉండవు అనేది ఆయన తాత్పర్యం! .
@@@@
నిజమే కదా! ప్రతివారి గురించి ఏదో ఒక వ్యాఖ్య చెయ్యకుండా అస్సలు ఉండం! అందులో కూడా ఎక్కువగా ప్రతికూల వ్యాఖ్యలే చేస్తుంటాం! అది ఒక మానసిక ఆనందం మనకి.
రామాయణంలో ఈ శ్లోకం చూద్దాం!
కధంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి
నస్మరత్యపకారాణాం శతమప్యాత్మ వత్తయా
శ్రీ రాముడు ఎదుటి వారు తనకి ఎంత తీవ్రమైన ద్రోహం చేసినా...తన పట్ల ఎంత అన్యాయంగా ప్రవర్తించినా అది వెంటనే మరచిపోతాడుట. దానికి ఏ విధమైన ప్రాధాన్యము ఇవ్వడుట. దీనికి ఉదాహరణ గా కైకేయి తనని వనవాసానికి వెళ్ళమని ఆదేశించి..భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని దశరధ మహారాజుని కోరినా... ఆమెని ఒక్క మాట కూడా అని నిందించటానికి ఇష్టపడడు.
కానీ ఎవరయినా... తనని వుద్దేశించి సాహాయం చెయ్యాలని కాకుండా..ఇతరులకి చేస్తున్నప్పుడు అనుకోకుండా తనకి గోరంత సహాయం జరిగినా కూడా..అది రాముడు తలచుకు తలచుకు పొంగిపోయి వారికి కృతజ్ఞతలు చెబుతాడట.
@@@@
'బజారు నించి వస్తూ చౌకగా ఉన్నాయని మాతో పాటు మీకూ ఒక డజను అరటిపళ్ళు తెచ్చాం' అని మన పక్కింటి వాళ్ళు తెస్తే వారి సహాయానికి అభినందించటం మానేసి... "ఆ:( ఊరికే తెచ్చారా..మొన్న నేను వాళ్ళకి ఆవకాయ ఇచ్చాను కనుక తెచ్చారనో..పళ్ళు అస్సలు బాగా లేకపోయినా బోలెడు డబ్బు పోశారనో ..వాళ్ళ ఖర్చు కూడా ఈ పళ్ళల్లో వసూలు చేసుకున్నారనో" ..వారికి దురుద్దేశ్యాలు ఆపాదించటానికి ప్రయత్నిస్తాం.
"మొన్న వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టాల్సి వస్తే..ఆయన ఊళ్ళో లేకపోతే నేను ఇవ్వబట్టి సరిపోయింది. లేకపోతే వాడ్ని స్కూల్ నించి తీసేసే వాళ్ళు" అని వెంటనే ఆ డబ్బు తిరిగిచ్చేసినా..ఆ చిన్న సహాయాన్ని గోరంతలు కొండంతలు చేసి చెబుతాం!
ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం మనలో చాలా మందికి అలవాటు.
అసలు ఏ విషయాన్ని గురించి బేషరతుగా అనుకూలంగా ఆలోచించలేము.
మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది మన ఆలోచనా విధానం అనేది నిర్ద్వంద్వంగా ఒప్పుకోవలసిన వాస్తవం.
మంచి ఆరోగ్యంతో ఉండాలంటే సానుకూల ఆలోచనా విధానం ఉండాలి.
ఎదుటి వారిలో మంచిని బేషరతుగా గుర్తించగలిగే సంస్కారం ఉండాలి..
మనకి ఉన్నంతలో.. వీలైతే సహాయం చేసే అలవాటు చేసుకోవాలి.
అది ఎలాగంటే
మన కాలికి మట్టి అంటుకోకూడదంటే మనమే చెప్పులేసుకోవాలి.
మనకి చలి వెయ్యకూడదంటే మనమే వస్త్రాలు ధరించాలి.
మనకి ఆరోగ్యం బాగుండాలి అంటే మనమే పౌష్టిక.. సమతుల ఆహారం తీసుకోవాలి..మంచి మందులు వాడాలి.
వీటన్నిటితో పాటు సానుకూల ఆలోచనా విధానం..స్నేహ శీలత..పరోపకార బుద్ధి అలవరచుకోవాలి.
ఏమంటారు?
రామాయణాన్ని చదివి వదిలేద్దామా..లేక అందులో నించి ఏమైనా నేర్చుకుందామా?


కామెంట్‌లు