*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0208)*
 *"మాసానామ్ అస్మి మార్గశీర్షోహమ్" అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించిన ఈ మార్గశీర్ష మాసంలో, పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ సకల శుభాలు, పరమాత్మ తో దగ్గర తనం కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*ఇంటికి తిరిగి వచ్చిన పార్వతికి సత్కారం - మహాదేవుని నట లీల - పార్వతి ని యాచించడం - తిరస్కారం - అంతర్ధానం*
*నారదా! సుదీర్ఘకాలం మహోగ్రంగా సాగిన తపస్సు పూర్తి చేసుకుని కాళి ఇంటికి వస్తున్నది అన్న వార్త తెలుసుకుని మేనకా హిమవంతులు, అన్న మైనకుడూ, రాజ పురోహితులు, వంది మాగధులు ఎదురు వెళ్ళి పార్వతిని ఆహ్వానించారు. ఎంతో కాలం తరువాత తమ కూతురిని చూస్తూ తల్లితండ్రులు, అన్న మైనాకుడు కూడా చాలా సంతోషించారు. పార్వతి తమ ఇంటి పేరుకు గొప్పతనం చేకూర్చే పని చేసి వచ్చింది అని అక్కున చేర్చుకున్నారు. వీరందరినీ చూచి, పార్వతి కూడా అమితమైన ఆనందాన్ని పొంది, చెలికత్తెలు జయ, విజయ లతో కలసి నమస్కారం చేసింది. వంది మాగధులు, బంధు మిత్రులు పార్వతి పై పూల వర్షం కురిపించి, సుగంధ ద్రవ్యాలు ఇచ్చి స్వాగతం పలకడాన్ని ఆకావీధిలో కొలవైన దేవతా సమూహం, అంబకు జరుగుతున్న పూజకు మురిసిపోయి గగన కుసుమాలు విడిచిపెట్టారు. పార్వతి ని ఇంటిలోకి తీసుకు వెళ్ళిన తల్లిదండ్రులు, చెడు ప్రవర్తన కలిగిన కొడుకు కంటే సుపుత్రియే బంగారమని తలచుకుంటూ ఆనంద పరవశులు అయ్యారు. పుత్రిక ఆగమనాన్ని అనుభవిస్తూనే హిమవంత మహారాజు, పురహితులకు, బ్రాహ్మణులకు, సాధారణ ప్రజలకు కూడా అనేక బహుమతులు ఇచ్చి తమ సంతోషాన్ని వారితో పంచుకున్నాడు.*
*లీలా మానుష వేషధారి, భగవానుడు, భక్తవత్సలుడు అయిన శంకరుడు, సర్వమంగళ తనను యాచకుడిగా రమ్మనమని అడిగిన కోరిక తీర్చడానికి, ఎడమ చేతిలో కొమ్ము, కుడిచేతిలో ఢమరు, వీపుపైన జోలే, ఎర్రని బట్టలు వేసుకుని, దారి పొడవునా నృత్య గానములు చేస్తూ, హిమవంతుని రాజమందిరము చేరారు. ఆ సమయంలో పర్వత రాజు, స్నాన సంధ్యాదుల కోసం నదికి వెళ్ళాడు. నాట్యకారుని రూపంలో ఉన్న శంభుడు, మేనక వద్దకు వెళ్ళి, తన గాన కౌశలాన్ని, నాట్య విన్యాసాలను అనేక రీతులలో ప్రదర్శించారు. ఈ నటనా విధానానికి మేనకతో సహా పరివారం అంతా చాలా సంతోష పడ్డారు. అంబ అయిన  కాళి, వచ్చినాడు తనకు వరమొసగిన శంభుడే అని గుర్తించింది. నాట్యకారుని నాట్య విలాసం చూస్తూ పరమానంద భరితురాలై మూర్ఛ స్థితిని అనుభవిస్తుంది.*
*అప్పుడు, మూర్ఛలో ఉన్న పార్వతికి, శివ భగవానుడు తన స్వస్వరూపాన్ని చూపించి, భద్రే! నీ కోరిక ఎమిటి అని అడిగారు. దానికి ఆ కమలాక్షి, నీవే నా భర్త అవ్వాలి అని అడుగుతుంది. కాళి కోరికను అనుగ్రహించి శంభుడు మరల నాట్యకారుని గా అందరినీ ఆనందింప చేస్తున్నారు. పార్వతి మూర్ఛా స్థితి తొలగిపోయి మాములుగా తల్లి పక్కనే ఉంది. రుద్రుడు, మేనక తనకు బహుమానంగా తెచ్చిన, ధన కనక వస్తు వాహనాలను తీసుకోకుండా, పార్వతిని ఇచ్చి వివాహం చేయమని అడిగారు. మేనకకు కోపం వచ్చింది. ఇంతలో, హిమవంతుడు కూడా వచ్చాడు. నాట్యకారుని కోరిక తెలుసుకుని, భటులను పిలిచి నాట్యకారుని ఆవలికి పంపమని చెప్పాడు.*
 
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు