ఎందుకో వేదన! ఆవేదన;-- యామిజాల జగదీశ్
అనేక సంవత్సరాల తర్వాత ఉమ (మా అన్నయ్య కూతురు) మద్రాసు నుంచి కొన్ని గంటలు ఉండటానికి వచ్ఛి వెళ్ళిపోయింది. 
కొన్నేళ్ళ క్రితం మా నాన్నగారికి సంబంధించి ఒక పుస్తకం తయారు చేసి పెట్టుకున్నాను. ఆ పుస్తకం చూడటానికి వచ్చిన ఉమకు మా నాన్నగారి డైరీలతో పాటు శనైశ్వరుడిని స్తుతిస్తూ రెండు వందల పద్యాలను రాసిన పేజీలను చూపించాను. ఈ పద్యాలలో మానసిక వేదనను వ్యక్తపరచడమే కనిపించింది చాలా చోట్ల. 

నాకు పద్యాలమీద బొత్తిగా పట్టు లేదు. కారణం నాదంతా అరవగోల. తెలుగుమీద చదవాల్సిన రోజుల్లో బొత్తిగా దృష్టి పెట్టలేదు. పద్యాలసలు అర్థం కావు. మరి స్కూల్లో ఎలా ప్యాసయ్యావని అడగొచ్చు. కొన్ని పద్యాలు బట్టీ పట్టి రాయడమే. ఆ తర్వాత వివిధ పత్రికలలో పని చేసినా గుడ్డిలో మెల్లలా కొట్టుకురావడమే తప్ప ఇప్పటికే భాష మీద పట్టు లేదు. ఏకవచనం, బహువచనం అంటే అర్థాలు తెలుసు తప్ప వాటినెలా ప్రయోగించాలో తెలియని బాపతు నా తెలుగు. అయినప్పటికీ మా నాన్నగారు రాసిన పద్యాలలో కొన్నిటిని ఎలాగోలా చదివాను. అలా కూడబలుక్కుని చదివిన చేతిరాత పుస్తకమే ఈ శనైశ్వర పద్యాలు. చదవడానికేం మొత్తం చదివాను. వాటిలో అక్కడక్కడా ఓ అయిదు పద్యాలిక్కడ మీతో పంచుకున్నాను. ఈ 270 పద్యాల సారాంశమైతే బోధపడింది. అందులో చాలా చోట్ల ఆవేదననే వ్యక్తం చేశారు. మచ్చుకి ఓ అయిదు పద్యాలిక్కడ ప్రస్తావించాను.

1
శ్రీ మహనీయ భానుసుత ! చిత్తమునందు దలంతు నిన్ను మా/
క్షేమము నీయధీనమని; చిర్నవ్వు మోమున మమ్ము జూడుమా/
ప్రేమదలిర్ప రేబవలు ; పెక్కులు పలగనేల నీదయన్/
మేము సుఖమ్ముగా సతము మేలును పొందగనే ; శనైశ్చరా!

2
కనికరపు చూపుతోనను
గణమయ్యా ; రేబవల్ సుఖంపడు రీతిన్
నినుమది నుతియింతుగదా
అనుదినమును సూర్యనందనా ! శనిదేవా!

3
దేహగేహ సుఖమ్ము శాంతియును లేదు
గ్రంథరచనకు ఫలితము కానరాదు
ఈవొకింత కృపం జూచితేని సతము
హాయిగా నుండు నాకు పద్మాప్తపుత్ర !

4
ఆంగ్లమానముచే డెబ్బడాదరయది
జన్మదినము జూన్ పన్నెండు శనిసురేంద్ర
ఈ పయిన్ సుఖశుభవృద్ధి నెసగునట్లు
కమలహితసుత !నను బ్రోవు కరుణతోడ.

5
ఏమని వచింతు నో దేవ ! ఏమి తలచి
మమ్ము బాధించు చున్నావొ మాన్యచరిత
నిన్ను బోల్వారికిది తగునే తలంప
భక్తమందార! శనిదేవ! పాహి పాహి!

పద్యాల తీరిలా ఉంటే డైరీలలో మాకూ మనవలు మనవరాళ్ళకు ఇచ్చిన దక్షిణలు, ఎవరెవరికి ఉత్తరాలు రాశారో, ఏఏ రోజుల్లో ఏం రాశారో, ఎవరెవరు వచ్చివెళ్ళారో వంటి వివరాలన్నీ రిసుకున్నారు. విశేషాలేవీ లేకుంటే ఏవీ లేవని, క్షవరం బాగా చేసినతని పేరు ఇలా అనేకం రాసుకున్నారు. 

1998 మార్చి రెండవ తేదీన డైరీలో కొన్ని మాటలు రాశారు. అదే ఆఖరు. ఆ తర్వాత కలం పట్టలేదు. మరో 23 రోజులకు మద్రాసులోని టు నగర్లో ఉన్న బి.ఆర్. ఆస్పత్రిలో కాలధర్మం చెందారు.

మొత్తంమీద ఉమ రాకతో మా నాన్నగారి దస్తూరీతోపాటు రచనల గురించి ప్రస్తావించుకున్నాం. గంటలు క్షణాల్లో సాగిపోయాయి. సరదా సరదాగా ఉంది. కామెంట్‌లు