సుప్రభాత కవిత ; బృంద
కరుగుతున్న క్షణాలలా
అలుపులేక గలగలా
సాగుతున్న  సెలయేరు

ఎదలోతుల ఒదిగున్న
ఏవేవో జ్ఞాపకాల
కదులుతున్న దొంతరలు

పచ్చగ మనసును
వెలిగించే 
వెచ్చని మధుర భావనలు

నింగి పైనుండీ తొంగిచూసే
పాలమబ్బులంటి
పిచ్చి కోరికలు...

అల్లరిపిల్లల అదుపులో
పెట్టినట్టు
అడ్డగిస్తున్న తరూశ్రేణులు

ప్రశాంతమైన ఉదయాన
సుందర దృశ్యం  చూసి
మూగబోయే మానసాలు

పొందుతున్న పరవశాలు 
అందుతున్న ఆనందాలు
ఆకుపచ్చని జ్ఞాపకాలు

సుతిమెత్తని భావనలను
మీటుతున్న  హృదయవీణ
మధురమైన సవ్వడులు

పెదవులపై మొదలై
మోమంత పరచుకున్న
వెన్నెలంటి  చల్లని నవ్వులు

మస్తిష్కపు మూలలో
కదులుతున్న కలలను
తట్టిలేపు తలపులు

ఆహ్లాదకరమైన  రోజును
ఆనందాలు నింపమని
ఆహ్వానిస్తూ..ఆలపించే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు