నేను విశ్వాసానికి మారుపేరుని;-- యామిజాల జగదీశ్
ఆశతో 
ఇష్టంతో 
నన్ను పెంచుకునే 
యజమానులకు
నేనొక ముద్దుల ప్రాణిని

అన్నం పెట్టిన వారిని
తుదిశ్వాస వరకూ మరచిపోను
కృతజ్ఞతతో ఉంటాను

తప్పు చేసిన వారిని
వెంటపడి వెంటపడి తరుముతాను
చిక్కాడో కరుస్తాను

నిజానికి 
నాకు హింసంటే ఇష్టం లేదు.
తోకాడించడం మరిచిందీ లేదు

ఒక పూట అన్నానికీ
నిజంగా శ్రమిస్తాను
నా ఆకలి తీర్చిన వారికి 
నేను తీర్చుకునే రుణమల్లా
వారి జోలికి ఎవరూ రాకుండా
కంటికి రెప్పలా చూసుకుంటాను

కుక్కవని
చులకనగా మనుషులకన్నా
నా గుణం గొప్పది
నేను మీలా నమ్మకద్రోహం 
చేయను

ఎంత పెడితే అంతే తింటాను
అంతే ప్రాప్తమనుకుంటాను తప్ప
తిరగబడను
అందుకే నా తృప్తికి లోటు లేదు

నీతీ నిజాయితీ అంటూ 
నేనేమీ పుస్తకాలు చదివి 
తెలుసుకోవలసిన అవసరం లేకుండానే
దేవుడు మాకు 
పుట్టుకతోనే సద్గుణాలను నాటాడు
మా ఎదలో...

కలహం 
మాకు తెలీదు
ద్రోహం 
మాకలవాటు లేదు
నమ్మించి
మోసగించడం 
మా గుణం కాదు

విశ్వాసమే మా ఊపిరి!!

కాలినికి తగినట్టు 
మాటలు మార్చేసే మనిషీ
నేను మొరిగే జీవిని కావచ్చు
కానీ మాటలు మార్చడం మాకు తెలీదు
నన్ను పెంచే 
యజమానులకెప్పుడూ 
కట్టుబడే ఉంటాం 

బాధ్యత కోసం
కన్నీళ్ళయినా దిగమింగుతాం
కానీ
మేము కన్నీరు కార్చేదల్లా
యజమానికి కష్టమొచ్చినప్పుడే
వారి బాధను భరించలేం

చనిపోయిన యజమానికి
మౌనంగా సంతిపం తెలియజేస్తాం
పస్తులుండటానికీ వెనకాడం
నటించడం తెలీని వాళ్ళం మేము
కృతజ్ఞతే మా ఆటాపాటా
ఎదగడానికి
తోకాడిస్తూ బతుకుతాం తప్ప
నమ్మినవారిపట్ల
ఇరవైనాలుగ్గంటలూ
విశ్వాసంగా ఉంటాం
విశ్వాసమే మా శ్వాసా ధ్యాసా

మమ్మల్ని
నోరులేని ప్రాణి అనుకుని
హీనంగా చూడొద్దు మనిషీ
మా విశ్వాసగుణం ముందు
మీరేపాటి...

ఆరడుగుల మనిషీ
ఇప్పటికైనా 
మా గుణం తెలిసి మెలగు
నీకెప్పుడు ఉంటాం వెలుగై


కామెంట్‌లు