సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -110
ధాన్య పలాల న్యాయము
*****
ధాన్యం అంటే వరి, గోధుమ, రాగులు,యవలు, పెసలు, కందులు, నువ్వులు, జొన్నలు, సజ్జలు, మినుములు మొదలైనవి.వాటినే ధాన్యము లేదా ధాన్యాలు అని పిలుస్తాం. ధాన్యానికి మరొక అర్థం ధనియాలు అని కూడా ఉంది.
పలాలము అంటే పొల్లు అనగా గింజలేని వడ్లు,గడ్డి,వట్టిగడ్డి అనే అర్థాలు ఉన్నాయి.
ధాన్యంలో గింజలేని వడ్లు అంటే తాలుతో కలిసిన  ధాన్యాన్ని ధాన్య పలాలము అంటారు.
పండించిన ధాన్యాన్ని కళ్లమునుండి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తాము.అలా వచ్చిన ధాన్యాన్ని అలాగే భుజించలేము. దానిలోని పొల్లు అంటే గింజలేని తాలును చెరిగి గట్టి ధాన్యాన్ని వేరు చేస్తాం. అలా వేరు చేసిన ధాన్యాన్ని దంపి లేదా మర పట్టించి బియ్యాన్ని మాత్రమే గ్రహించి ఊక , తవుడు మొదలైనవి ఏమైనా ఉంటే వాటిని కూడా త్యజిస్తాము అంటే వదిలేస్తాం.
అంటే  ధాన్యము వలె విషయ సేకరణ ఎంత చేసుకున్నా అందులో అవసరమైన సమాచారాన్ని మాత్రమే అనగా ఏది ముఖ్యమో దానినే గ్రహించడమనే అర్థంతో ఈ "ధాన్యపలాల న్యాయమును" ఉదాహరణగా చెబుతుంటారు.
 అలాగే మనం రోజూ ఎందరివో మాటలు వింటూ ఉంటాం. అందులోని సారాన్ని, వారు చెప్పే మాటల్లో సత్యాసత్యాలను   జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. కానీ వెంటనే ఒక అభిప్రాయానికి రాకూడదు.అందుకే సుమతీ శతక కర్త ఇలా అంటాడు.
 "వినదగు నెవ్వరు చెప్పిన/ వినినంతనె వేగపడక వివరింపదగున్ / గనికల్ల నిజము తెలిసిన/ మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ!"
లోకములో ఎవరు ఏమి చెప్పినా ఓపికగా వినే వాడే ఉత్తముడు. ఏ విషయాన్నైనా విన్న వెంటనే తొందరపడి ఓ అభిప్రాయానికి రాకుండా, అందులోని నిజానిజాలను తెలుసుకునే వాడే ఈ భూ ప్రపంచంలో  నీతి పరుడుగా నిలుస్తాడని ఈ పద్యం యొక్క భావము.
ధాన్యము అనే రాశిని తెచ్చుకోవడం అది ధాన్యం అని తెలుసుకోవడం అనేది జ్ఞానము అనుకున్నట్లయితే, దానికి సంబంధించిన ఉపయోగాలు తెలుసుకోవడం విజ్ఞానము.
అంతే కాకుండా దానిలోని అంతఃసారాన్ని అంటే నిజమైన సారాంశాన్ని గ్రహించడం ప్రజ్ఞానం అంటారు.
 ఈ విధంగా ధాన్యము అనే రాశిని తెచ్చుకోవడం ఒక ఎత్తయితే అందులో ఆహారానికి అవసరమైన బియ్యాన్ని మాత్రమే గ్రహించి మిగిలినది వదిలేయడంలో ఎంత లోతైన విషయ సారం ఉందో ఈ ధాన్య పలాల న్యాయము వలన మనకు తెలుస్తుంది.
ఈ విధంగా వడ్ల గింజలో బియ్యం గింజను గ్రహించిన విధంగా  నిత్య జీవితంలో వినే,కనే అనేక విషయాలలో అనవసరమైనవి వదిలేస్తూ అసలైన జ్ఞానాన్ని గ్రహిస్తూ  ధాన్య పలాల న్యాయమునకు న్యాయము చేద్దాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు