మనిషి ఆయువు ఎంత?;- - యామిజాల జగదీశ్
 బుద్ధుడు తన శిష్యులను చూసి ఓ ప్రశ్న వేశారు.
ఒక మనిషి ఆయువు ఎంత అని.
ఒక శిష్యుడు లేచి "నూరేళ్ళు" అన్నాడు.
బుద్ధుడి ముఖాన చిన్ననవ్వు నవ్వి "తప్పు" అన్నారు.
శిష్యులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.అదేంటి వందేళ్ళన్నది తప్పేమిటీ అని గుసగుసలాడారు. వందేళ్ళ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుందా? అలా అయితే ఎన్నేళ్ళు కావచ్చు? వందేళ్ళలోపే అయ్యుంటుందా అని తమలో తామనుకున్నారు. 
కనుక ఒక శిష్యుడు లేచి డెబ్బై ఏళ్ళు అన్నాడు తన మాటగా.
అది కూడా తప్పే అన్నారు బుద్ధుడు సన్నగా.
అరవై ఏళ్ళన్నాడు ఇంకొక శిష్యుడు.
అదీ తప్పే అన్నారు బుద్ధుడు.
అయితే ఒక శిష్యుడు అవన్నీ ఎక్కువ ఆయుష్షేమో కనుక యాభై ఏళ్ళు 
 అంటూ బుద్ధుడి జవాబుకోసం మౌనంగా నిల్చున్నాడు.
బుద్ధుడి మాట ఆ శిష్యుడినికూడా ఆలోచనలో పడేసింది.
అవును. 
అది కూడా తప్పే అని బుద్ధుడు అనడంతో ఆ శిష్యుడికి విచారం.
అతనికే కాదు, మిగిలిన శిష్యులకూ విచారమే. 
ఇదేంటీ ఆశ్చర్యంగా ఉంది. మనం ఏది చెప్తున్నా తప్పంటున్నారు. అదేంటీ ఒక మనిషి యాభై ఏళ్ళుకూడా జీవించలేడా అని చెవులు కొరుక్కున్నారు శిష్యులు.
కాస్సేపు బుద్ధుడు శిష్యులందరి వంకా చూశారు. 
శిష్యులు కూడా మౌనంగా బుద్ధుడి వంకే చూస్తున్నారు ఆయన ఏం చెప్తారా అని.
శిష్యుల అయోమయ ముఖాలు చూడటం నచ్చక బుద్ధుడు "ఒక మనిషి ఆయువు ఒక శ్వాస విడిచే సమయం" అన్నారు.
శిష్యులందరూ ఆ మాటతో విస్తుపోయారు. ఏమిటీ శ్వాస విడిచే ఆ క్షణకాలమేనా అని అడిగారు.
"నిజమే...శ్వాస విడిచే సమయం క్షణమేగా. జీవితమనేది శ్వాస విడవటంలోనేగా ఉంది. కనుక ప్రతి క్షణమూ బతకాలి. మనుషులలో చాలా మంది గతంలోని ఆనందక్షణాలను నెమరేసుకుంటూ జీవిస్తారు. ఇంకొందరైతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయంతోనూ దిగులుతోనూ బతుకుతుంటారు. నిన్న అనేది ముగిసిపోయినది. అది గతం. అంటే అయిపోయిన కాలం. అలాగే రేపు అనేది ఎవరూ తెలుసుకోలేని భవిష్య కాలం. కనుక దాని గురించి ఆలోచిస్తూ కాలాన్ని గడపడం మూఢత్వం. కనుక వర్తమానం మాత్రమే మన
మన గుప్పెట్లోది. అందుకే ఆ ప్రతి క్షణాన్ని పూర్తిగా జీవించాలి" అన్నారు బుద్ధుడు.

కామెంట్‌లు