తోలుబొమ్మలాట(మణిపూసలు);- పి. చైతన్య భారతి,7013264464
గొప్పకళా ప్రదర్శనగ 
రాజ్యమేలేను మేటిగ
జానపద కళల్లోన  
తోలుబొమ్మలె ఉన్నవిగ!

సాహిత్య సంగీతాలు 
కథానుకూల చిత్రాలు 
సమయానుకూలంగా 
కదిలించేరీబొమ్మలు!

సాంకేతిక యుగంలో 
మార్పుల ప్రవాహంలో 
ఆదరించువారులేక 
నిలవలేదీ ప్రజలలో!

అలసిన హృదయాలకు 
జానపద మనసులకు 
వినోదాన్ని పంచినది
విశేషమై జనులకు!

నాటకాలు సినిమాలకు 
ప్రేరణై అద్భుతాలకు  
నిలిచెను అపురూపమై 
ఉల్లాసమే పంచుటకు!

జరిగిన సంఘటనలతో 
అల్లుకున్న ఊహలతో 
రూపాన్నె కల్పిస్తారు
ప్రాణంపోసి బొమ్మలకు!

తెరవెనుకే వుంటారు 
కథలను నడిపిస్తారు 
విపరీత కష్టాలను 
గుండెలోనె దాస్తారు!

సకుటుంబ సమేతంగ
కథ రక్తి కట్టించగ
జనుల చప్పట్లకు వారి 
హృదయముప్పొంగేనుగ!

కాస్త అణాలతొ టికాన
బతుకుబండీ భారమున
కుటుంబాల నడిపేరు 
దినదినమొక భారమ్మున!

జంతుచర్మాలతోను 
ఆకర్షణీయంగను 
నైపుణ్యం కలబోసి 
నిర్మింతురు బొమ్మలను!

కాగడాల వెలుతురుతో 
తాళ వాయిద్యాలతో 
నైపుణ్యం చూపుతారు 
అష్టావధానాలతో!

జుట్టుపోలిగాడి నవ్వు 
బంగారక్క పాత్ర కెవ్వు 
ప్రేక్షకుల కునుకులన్ని 
హాస్యంతొ ఆమడ దవ్వు!

క్రీస్తు పూర్వం జన్మించి 
రాజుల సైతం మెప్పించి 
విజ్ఞాన వికాస నెలవు 
ఈ ఆటె ప్రత్యేకించి!

టీ వి సినిమాల వల్లను 
అంతరించె దశలోను 
కొట్టుమిట్టాడుతోంది 
చేరదీయాలీకళను!


కామెంట్‌లు