సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -125
పంజర చాలన న్యాయము
*****
పంజరము అంటే దేహము,శరీరము యొక్క ఎముకల గూడు,కంకాళము అనే అర్థాలు ఉన్నాయి.
చాలనము అంటే చలింప జేయుట,త్రిప్పుట, జల్లెడ,జల్లించుట అనే అర్థాలు ఉన్నాయి.
పంజరమును చలింప జేయుట,పగల గొట్టుట అనేది సాధారణ అర్థం. 
పంజరమున ఉన్న పక్షులన్నీ ఒక్కటిగా ఏకమై పంజరాన్ని ముక్కులతో పొడవడంతో  పంజరం పగిలిపోయి పక్షులన్నియు ఎగిరి పోయాయి అంటే ఐకమత్యంతో అనుకున్నది సాధించగలమనే అర్థంతో ఈ 'పంజర చాలన న్యాయము'ను ఉదాహరణగా చెబుతుంటారు.
ఐకమత్యం యొక్క బలం అంతా ఇంతా కాదు. ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే ఐదు వేళ్ళూ కలవాలి.అలా పట్టుకోగలం. గడ్డిపోచలన్నీ కలిపి పేనితే బలమైన తాడులా తయారవుతుందని అందరికీ తెలిసిందే.
" ఐకమత్య మొక్క టావశ్యకంబెపుడు/ దాని బలిమి నెంతనైన గూడు/గడ్డి వెంట బెట్టి కట్టదా యేనుంగు/" అనే వేమన పద్యాన్ని 'ఖలే కపోత న్యాయము'లో కూడా చెప్పుకున్నాం.
 చిన్నయ సూరి పంచతంత్ర కథలో ఐకమత్యం లేక పోవడం వల్ల సింహం బారిన పడి చనిపోయిన ఎద్దుల కథ కూడా మనకు తెలుసు.
చీమలకు నాయకుడు లేకున్నా అవి ఐకమత్యంతో బారులు తీరి ఆహారం ఎక్కడ ఉన్నా శోధించి తీసుకుని తమ పుట్టలకు చేరవేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు.
"ఇల్లు ఆనందాల హరివిల్లు- సమైక్యతా పొదరిల్లు" అనడం ఎంతైనా సముచితం. కష్టనష్టాలను కలిసి భరిస్తూ ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తూ కలిసి వుంటే ఎంత సుఖం ,ఆనందం ఉంటుందో అద్దంలా ఇల్లు చూపిస్తుంటుంది.
ఎంతో ఘనంగా పండుగలా చేసుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం, 'మేడే' ల  వెనుక ఎంతటి సమైక్యతా పోరాటం ఉందో మనందరికీ తెలుసు. చదువుకున్నాం కూడా.
  ఇలా ప్రతి ఉద్యమం యొక్క గెలుపు,విజయం వెనుక తరిచి చూస్తే ఐకమత్యంతో చేసిన పోరాటాలే కళ్ళముందు మెదులుతాయి.
 కేవలము పక్షులకే కాదు, మానవ జీవన సౌఖ్యానికీ, నేడు పొందిన అనేక సదుపాయాలకు,సౌఖ్యాలకు,పొందిన హక్కులకు ఉదాహరణగా ఈ 'పంజర చాలన న్యాయము'ను చెప్పుకోవచ్చు.అందులో ఎలాంటి సందేహమూ లేదు కదా !.అందుకే ఓ మహానుభావుడు అన్న" పోరాడితే పోయిందేం లేదు బానిస సంకెళ్ళు తప్ప". ఈ మాటలను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకొని సమాజ హితం కోసం కలిసి కట్టుగా పోరాడుదాం. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు