మానవ సేవే మాధవ సేవ ; - సి.హెచ్.ప్రతాప్
 భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవడం మానవులందరి ముఖ్య కర్తవ్యం. సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఏ ఇతర జీవికి భగవంతుడు ఇవ్వని వరం మనిషికి మాట్లాడే రూపంలో ఇచ్చాడు. మన మాటలు, చేతలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులను వేధించే విధంగా మన యొక్క ఏ చర్య  ఉండకూడదు. ప్రతి మనిషి తోటి వారికి సాయం అందించాలి. మనకు సాయం చేసే వారికే కాకుండా, అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేయగలడం దైవత్వం. కానీ ఎవరికీ కలలో కూడా హాని చేయకపోవడమే అత్య్త్తమం. గంధపుచెట్టు తనను నరికేవాడికి కూడా సుగంధాలు అందించే విధంగా మన జీవన విధానం తీర్చిదిద్దుకోవడం మంచిది. ఎపుడైనా సరే మనకు తెలియకుండా కూడా పరులకు మన వల్ల నష్టం, కష్టం కలిగితే, అది తెలుసుకుని పశ్చాత్తాపపడి, మరోపర్యాయం అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
ప్రతి మనిషికి జీవితం ఒకటే అయినా దానికి ముడిపడి ఉన్న కుటుంబ బాంధవ్యాలకు నోచుకోలేని అభాగ్యులకు చేయుతనివ్వడం,అనాధలను ఆదుకోవడం, కన్నవాళ్ళు చేసిన తప్పుల వల్ల చీకటిలో ఉన్న వారి జీవితంలో వెలుగు నింపడం వంటి సత్కార్యాలకు పూనుకోవాలి. మానవ సేవే మాధవ  సేవ అన్న ఆర్యోక్తికి ప్రతీకగా మన జీవితం దిద్దుకోవాలి.
భాగవతంలో శ్రీకృష్ణునితో ఉద్ధవుడు ఇలా చెబుతాడు: ‘స్వామీ! నీ సేవలో పడిన భక్తునికి ముక్తి, ఆర్థికాభివృద్ధి, మొదలైన వాటిపై ఆసక్తి ఉండదు. వీటన్నిటివల్లా కలిగే సుఖాలన్నిటినీ నీ సేవలో అతడు సులభంగా పొందగలు గుతాడు. నాది ఒకే ప్రార్థన. ఎన్ని జన్మలైనా నీపై నాకు అచంచల భక్తివిశ్వాసాలు సదా ఉండుగాక’. కనుక మానవసేవే మాధవసేవ అని అందరూ గుర్తుంచుకోవాలి.
ఈ జగత్తున జనులు నిరంతరము ఏదో ఒక ఆదర్శ సాధన కోసం వివిధ  కర్మలో నిమగ్నులౌతారు. ఆ కర్మలన్నింటిని నా కోసమే చేస్తూ , నన్నె సదా ధ్యానిస్తూ , పవిత్రమైన నదవడికతో వుంటే నా సేవా రూప పరాభక్తిని పొందుదురు. అంటే మనం దానం చేస్తున్నా, సేవ చేస్తున్నా ఎదుటి వానిని శ్రీకృష్ణునిగనే భావిస్తూ చేయాలి.
అందుకే ‘మానవసేవే మాధవసేవ అని ‘జనసేవయే జనార్ధనసేవ అని చెప్పేది. శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన బోధ, బ్రహ్మదేవ్ఞనకు చేసిన బోధ నిజానికి మన అందరికీ చేసిన బోధ అని మనం గ్రహించాలి. మనం ఏ కర్మము చేస్తున్నా నిరంతరం భగవంతుడిని స్మరిస్తూనే ఉండాలి. కర్మఫలితాన్ని ఆయనకే వదలి వేయాలి. 

కామెంట్‌లు