సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -138
పిపీలికాభి ర్మంథాన గిరి విలేపన న్యాయము
******
పిపీలికము అంటే చీమ.పిపీలికాభి అంటే చీమలతో. మంథన గిరి అంటే మందర పర్వతము. విలేపనము అంటే చందనము మొదలైన వాని పూత, చందనము అని అర్థం.
పిపీలికాభి ర్మంథాన గిరి విలేపనము అంటే చీమలతో మందర పర్వతం చుట్టూ చందనంలా పూత పూసిన అని అర్థం.
పర్వతం అంటే ఎంత పెద్దగా ఉంటుందో అందరికీ తెలుసు.ఎన్ని కోటాను కోట్ల చీమలు చుట్టుముట్టినా చందనం పూసినట్టు కనిపించడం సంభవమేనా ?అంటే అస్సలు కాదు. మరి చీమలతో మందర పర్వతం చుట్టూ పూత పూయడమంటే ఎంత అతిశయోక్తో  అర్థం చేసుకోవచ్చు.
దీనినే అసాధ్యమైన వాటిని ఊహించి చెప్పడం అంటారు.నమ్మరాని, నమ్మదగని మాటలు అని అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
కొందరు అతి చిన్న విషయాన్ని చిలువలు పలువలుగా వర్ణించి పెద్ద విషయంలా చెప్పడం గమనిస్తుంటాం.ఇలా చెప్పడాన్నే తెలుగులో 'గోరంతలు కొండంతలు చేయడం' అంటారు.
మరికొందరు అలవోకగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు.వారి మాటల నిండా అతిశయోక్తి అలంకారాలే కనిపిస్తూ, వినిపిస్తుంటాయి.
దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ముచ్చట మా తాతయ్య ఎప్పుడూ చెప్పి నవ్వించే వారు.
'పిల్లి పెసర గాయలు తేలేదేరా ?అంటే పిక్క దొడ్డు ఉన్నాయయ్యా! పట్టుకొద్దామంటే దర్వాజలో పట్టవు'. అన్నాడట ఇంట్లో పాలేరు.
ఇందులో ఒక్క మాటన్నా నమ్మదగినదిగా ఉందా? అసలు పెసర కాయే పెన్సిల్ కంటే సన్నగా ఉంటుంది.ఇక పిల్లి పెసర కాయ అంత కంటే సన్నగా ఉంటుంది.
 ఇలాంటి నమ్మదగని మాటలను 'పిట్టల దొర మాటలు' అని కూడా అంటారు.
 పిట్టల దొరను తెలంగాణలో లత్కోర్ సాబ్,బుడ్డర్ ఖాన్, తుపాకీ రాముడు అనే పేర్లతో పిలుస్తారు.ఇది పగటి వేషాల్లో ఒకటి.
వీళ్ల వేషము బ్రిటిష్ దొరను పోలి ఉంటుంది. పొట్ట గడవడం కోసం అందరినీ నవ్వించే మాటలు, నమ్మదగని మాటలను నమ్మశక్యం అనిపించేలా మాట్లాడే వారు.ఆ మాటల వెనుక వారి లేమితనము, పేదరికము కనిపించేవి. ఇలా ఊరిలో తిరుగుతూ రైతులు, పెద్దలు తృణమో పణమో ఇస్తే దానితో జీవితం గడిపేవారు.
ఇలాంటి మాటలు పగటి వేషగాళ్ళకో, సరదాగా కాసేపు నవ్వుకోవడానికో సరిపోతాయి. కానీ అతిగా ఎప్పుడూ ఇవే మాట్లాడితే చాచి లెంపకాయ కొట్టాలన్నంత చిర్రెత్తుకొస్తుంది."చెప్పే వాడికి వినేవాడు ఎంత లోకువో కదా!'' అనిపిస్తుంది.
కాబట్టి అలాంటి మాటల జోలికి పోకుండా,  నమ్మదగని మాటలను మాట్లాడి ఇతరుల ముందు అపహాస్యం పాలు కాకూడదని చెప్పడానికి ఈ "పిపీలికాభి ర్మంథాన గిరి న్యాయము" సరిగ్గా సరిపోతుంది కదా!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు