రాముటోపి - డా.ఎం.హరికిషన్ (నవ్వుల్లో ముంచెత్తే చిన్న కథ)

  ఒక ఊరిలో రాము అనే పిల్లవాడు ఉండేవాడు. రాముకి వాళ్ళ అమ్మ ఎండాకాలంలో ఒక అందమైన రంగు రంగుల టోపీ కొనిచ్చింది. రాము ఎండ పడకుండా దానిని నెత్తిన పెట్టుకొని ఆనందంగా తిరగసాగాడు.
రాము వాళ్ళ పక్క ఇంటిలో రవి అనే పిల్లవాడు వున్నాడు. ఆ పిల్లవాడు చాలా చెడ్డవాడు. ఎలాగయినా సరే రాము టోపి కొట్టేయాలి అనుకున్నాడు.
ఒకరోజు రాము నిదురపోతుంటే రవి ఆ టోపీని దొంగలించాడు. ఎవరికీ కనబడకుండా పశువుల పాకలోని గడ్డిలో దాచిపెట్టాడు. ఒక వారం తరువాత అందరూ మరిచిపోయాక తీసుకుందాం అనుకున్నాడు.
రవి వెళ్లిన కాసేపటికి ఒక బరగొడ్డు గడ్డికోసమని అక్కడికి వచ్చింది. గడ్డి పట్టుకొని లాగుతా వుంటే లోపలున్న టోపీ జారి దభీమని దాని నెత్తిన పడింది. 
“అరే... ఇదేదో భలే బాగుందే... ఎండపడకుండా చల్లగా గమ్మత్తుగా" అనుకుంటూ బరగొడ్డు నెత్తి మీద టోపీతో రోడ్డు మీద కులుక్కుంటూ నడవసాగింది.
బరగొడ్డు టోపీ పెట్టుకొని పోతూ వుంటే ఒక కుక్కపిల్ల చూసింది. 
“అబ్బ... ఎంత ముచ్చటగుంది ఈ టోపి. ఎలాగయినా సరే దీనిని కొట్టేయాలి” అనుకుంది. అంతలో దానికి ఒకచోట కొంచెం పచ్చగడ్డి కనబడింది. పరిగెత్తుకుంటూ పోయి ఆ గడ్డి తీసుకొచ్చి బరగొడ్డు పోయే దారిలో వేసింది. పచ్చగడ్డి చూసిన బరగొడ్డు సంతోషంగా దానిని తినడానికి తల వంచింది. 
అంతే... అలా తల వంచిన వెంటనే కుక్కపిల్ల వురుక్కుంటా వచ్చి ఆ టోపీని పట్టుకొని పారిపోయింది.
కుక్కపిల్ల నెత్తిన టోపీ పెట్టుకొని సంబరంగా ఎగురుకుంటా పోతా వుంటే చెట్టు మీద నుంచి ఒక కోతి చూసింది.
“అరే... ఎంత అందంగుందీ టోపీ. ఇది దాని నెత్తి మీద కన్నా నా నెత్తి మీద వుంటే ఇంకా అందంగా ఉంటుంది" అనుకొంది. కుక్కపిల్ల చెట్టు కిందకు రాగానే పైనుంచి లటుక్కున టోపీ తీసుకొని, చటుక్కున పైకి ఎక్కి పారిపోయింది.
చెట్టు మీద టోపీ పెట్టుకొని సంబరంగా కిచకిచలాడుతున్న కోతిని ఒక కాకి చూసింది. “అరే... ఇదేదో చాలా బాగుందే. గూడులాగా... దీనిని ఎత్తుకుపోతే మా పిల్లలు చాలా సంబరపడతాయి" అనుకుంది. వెంటనే వేగంగా దూసుకొని వచ్చి కాళ్ళతో ఆటోపీని పట్టుకొని ఎగిరిపోయింది.
కాకీ టోపీ తీసుకొని పోతూ వుంటే దారిలో ఒక గద్ద ఎదురయింది. “అబ్బ... ఎర్రగా ఎంత అందంగా వుందీ టోపీ. ఎలాగయినా సరే దీనిని ఆ కాకి దగ్గర నుంచి గుంజుకోవాలి” అనుకుంది. 
సర్రున వచ్చి టోపీని పట్టుకొని గుంజింది. కానీ కాకి వదలలేదు. రెండూ టోపీ కోసం పోటీపడుతూ అటూ ఇటూ గుంజుకోసాగాయి.
రాము ఇంటిలో టోపీ కనబడక విచారంగా దానికోసం వెతుక్కుంటా తిరుగుతూ వున్నాడు.
పైనేమో కాకీ, గద్దా రెండూ టోపీ కోసం తన్నుకుంటా ఉన్నాయి గదా... ఆ గొడవలో ఆ టోపీ జారిపోయింది. అది సర్రున పైనుంచి వచ్చి సరిగ్గా కింద పోతున్న రాము తల మీద పడింది.
“అరే... ఇది నా  నా రంగు రంగుల టోపీనే. ఎలా ఆకాశంలోంచి వచ్చి నా నెత్తిన పడింది. ఇదేదో భలే వింతగా వుందే" అనుకుంటూ రాము ఆనందంగా ఎగురుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
కామెంట్‌లు