ఇదేమిటో ...!!---సుగుణ.అల్లాణి .
 ఏమిటో ......!
అన్నీ కావాలంటుంది మనుసు 
అన్నీ దొరకవంటుంది మెదడు!
ఇసకలో వెన్నెల పాట --
పాడమంటుంది మనుసు.
ఇక చాల్లే ఆడింది --
నవ్వుతారంటుంది మెదడు!
తాడాట ----
ఆడాలనుందంటుంది మనుసు,
కాళ్లిరుగుతాయంటుంది మెదడు!
పరికిణీ ఓణీ అడుగుతుంది మనుసు,
పడుచుపిల్లవు కావంటుంది మెదడు!
బుల్లెట్ మీద తనతో  ---
తిరగాలంటుంది మనుసు....
బుల్లెట్ ఎక్కే  వయసా ఇది,
అంటుంది మెదడు......!
బడిలో పాఠాలు 
చెప్పాలనుందంటుంది మనుసు,
అరవై దాటాక పాఠాలు ---
చెప్పొద్దన్నారుగా ఊరుకో ,
అంటుంది మెదడు...!
ఇలా ఎన్నో…. ఎన్నెన్నొ.
ఎందుకో వయసు మనుసుకు పెరగదు
మనసు  తన కలల వైపు పరుగుతీస్తుంది
మెదడు  వాస్తవ చిత్రాన్ని చూపిస్తూంది 
ఈ రెండింటి మధ్య సంయమనమెప్పుడో!!
                              ***
                   

కామెంట్‌లు