మిఠాయివాలా;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

అతడు...
మనుషుల మనసులు దోచే దొంగోడు 
పేదల బతుకుల్లో అప్పుడప్పుడు 
తియ్యదనాన్ని నింపే ఇంద్రజాలికుడు 
పసి మనసులు మురిపించే మాయగాడు 
వీధివీధికీ నవ్వుల పువ్వులు రువ్వే పూలకొమ్మ 
ఏసుడైనా, ఎంకటేసుడైనా, 
దర్గా అయినా, దుర్గమ్మయినా 
వాడికేమీ తేడాలేదు 
జాతర్లన్నీ తిరుగుతాడు
మిఠాయిలెన్నో అమ్ముతాడు అప్పులెన్నోచేసి, 
కాయకష్టమంతా చేసి, 
చెమటనంతా పిండి,
రక్తాన్నే పెట్టుబడిగా పెట్టి, 
తన ఆశలన్నీ మిఠాయిలుగా చేసి 
కరెన్సీ పొట్లాలుగా మారుస్తాడు 
వాడు కన్న కలల్లాగే
వాడి మిఠాయిలకూ ఎన్నో రంగులు 
అందరి జీవితాల్లో తియ్యదనం నింపే 
వాడి జీవితం మాత్రం
కటికచేదు పులుముకుంది
పెరిగే పిల్లలూ
పెరిగే అప్పులూ, ఆకలీ, దరిద్రం 
అహర్నిశలూ శ్రమించినా దక్కనిఫలం
వాడు
ప్రపంచ విఫణి వీధుల్లో నిల్చున్న దిష్టిబొమ్మ 
నాగరికతా నైలాన్ వలలో చిక్కిన చేపపిల్ల!!
*******************************

కామెంట్‌లు