హైదరాబాద్ లో ఘనంగా జరిగిన వీక్షణం(కాలిఫోర్నియా) 136వ తెలుగు సాహిత్య సమావేశం - డా.కె.గీత ఆంగ్ల పుస్తకావిష్కరణలు!
 వీక్షణం(కాలిఫోర్నియా) సాహితీ వేదిక 136 వ సమావేశంలో ప్రముఖ కవయిత్రి డా.కె.గీత గారి ఆంగ్ల పుస్తకాలు Centenary Moonlight and other poems, At the Heart of Silicon Valley (Short Stories) ఆవిష్కరణ ప్రముఖ సినీనటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారి చేతుల మీదుగా డిసెంబరు 13, 2023 బుధవారం సాయంత్రం 6గం. నుండి 9గం.ల వరకు ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగం పల్లి, నల్లకుంట, హైదరాబాద్ లో జరిగాయి. 
డా|| కె.గీత రచయిత్రి, గాయని, భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం.  అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో  "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. పది సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు" పొందారు.
ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017), అసింట(2022)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. "అపరాజిత"- గత ముప్ఫైయ్యేళ్ళ స్త్రీవాద కవిత్వం  (1993-2022) పుస్తకానికి సంపాదకత్వం వహించి ప్రచురించారు. కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం మొ.న అవార్డులు, నవలకు తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాల్ని  పొందారు.
ఈ సభకు అధ్యక్షత తెలంగాణా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ కందుకూరి శ్రీరాములు వహించగా, ముఖ్య అతిథిగా మ్యూజ్ ఇండియా చీఫ్ ఎడిటర్ శ్రీ ఆత్రేయ శర్మ విచ్చేసారు. వక్తలుగా  ప్రముఖ కవులు, రచయితలు, అనువాదకులు   శ్రీ వసీరా, శ్రీ ఎలనాగ,  డా. ఆలపాటి ట్యాగ్ లైన్ కింగ్, శ్రీమతి శ్రీసుధ కొలచన, శ్రీ వి. విజయకుమార్ ప్రసంగించారు. ఇందులో దాదాపు నలభై మంది కవుల కవిసమ్మేళనం కూడా జరిగింది. కవిసమ్మేళనాన్ని డాక్టర్ రాధా కుసుమ గారు  నిర్వహించారు. శ్రీమతి విశ్వైక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.  వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి (యూ.ఎస్.ఏ), వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్  సభను విజయవంతంగా నిర్వహించారు. 
-----


కామెంట్‌లు