సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -350
స్నేహ దీప న్యాయము 
   ******
స్నేహము అంటే చెలిమి, చమురు, ప్రేమ.దీపము అంటే ప్రకాశము,మయూరి,శిఖి అనే అర్థాలు ఉన్నాయి.
 
స్నేహ దీపము అంటే ప్రేమ యొక్క దీపము.స్నేహము అనే నూనెతో వెలిగే దీపము.
 దీపము వెలగాలంటే ముందుగా  ప్రమిద కావాలి.ఆందులో చమురు,వత్తి ఉండాలి.అప్పుడిక దీపం వెలిగిస్తే ప్రమిదలో నూనె అయిపోయేంత వరకు వెలుగుతూనే ఉంటుంది.
 మరి స్నేహ దీపం ఎలా వెలుగుతుంది.దీనికి ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య గారు రాసిన గేయాన్ని చూద్దాం.
"తైలాలు లేకుండా వెలిగేటి దీపం/ విద్యుత్ లేకుండా వెలిగేటి దీపం/ హృదయాలలో ఎపుడూ నిలిచేటి దీపం/ నిజమైన దీపం మా స్నేహ దీపం అంటారు."
 అనగా స్నేహమనే దీపానికి ప్రేమ,ఆప్యాయత అనురాగం, అభిమానం, నమ్మకం అనే చమురు ముఖ్యం కానీ మామూలుగా  ఉపయోగించే  నూనె వత్తులు కాదు అనే అర్థంతో కూడా ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 స్నేహ అనే పదానికి  ఆప్యాయతతో పాటు తైలం లేదా చమురు/ నూనె అనే అర్థం కూడా ఉంది.దీనికి సంబంధించిన రామాయణంలో ఓ సన్నివేశాన్ని చూద్దాం.
రాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు మేనమామ ఇంటి నుండి వచ్చి విషయం తెలుసుకున్న భరతుడు అరణ్య వాసానికి వెళ్ళిన శ్రీరాముడిని రమ్మని బతిమిలాడుతాడు.
పితృవాక్య పరిపాలకుడైన రాముడు రానని చెప్పినప్పుడు  రాముని పాదుకలు అడిగి తీసుకుని వెళతాడు.
ఆ విధంగా భరతుడు తన భాతృ  భక్తిని పాదుకలో నింపుతాడు.అలా భక్తితో నిండిన పాదుకను ప్రేమ, ఆప్యాయతతో వెలిగిస్తాడు.అలా శోకమనే చీకటిలో  మునిగి వున్న అయోధ్యా నగరంలో రాముని పాదుకల  దీపంతో వెలుగులు నింపుతాడు.
ఇలా రాముని పట్ల, పాదుకల పట్ల భరతుడు  చూపిన భక్తి  అయోధ్యా వాసులందరికీ తెలిసిపోయింది.
ఈ విధంగా భరతుని భక్తి వలన పాదుకల తేజస్సు పెరిగి పద్నాలుగు లోకాలను ప్రకాశింప జేసిందని రాసిన ఈ శ్లోకాన్ని చదువుదాం.
"స్నేహేన దేవి! భవతిం విషయభిషించన్/ద్విస్సప్త సంఖ్య భువనోదరాది పరేఖాం/జాతం రఘుద్వాహదివాకర విప్రయోగత్/ అంధం తమిశ్ర మహారాత్ భరతః ప్రజానం/"
అలా స్నేహ దీపాన్ని చెలిమికే కాకుండా నిష్కల్మషమైన భక్తికి కూడా అన్వయించి చెప్పవచ్చని మనం గ్రహించవచ్చు.
నిత్యం సూర్యాస్తమయం కాగానే లోకమంతా చీకటి అలుముకుంటుంది. ఆ చీకటిని తొలగించడం కోసం మనం దీపాలను వెలిగిస్తాం.ఇప్పుడంటే విద్యుత్ దీపాలు వచ్చాయి కానీ పూర్వకాలంలో  చమురు దీపాలు వెలిగించి చీకటిని పారద్రోలే వారు.అంటే ప్రమిదలో స్నేహమనే తైలం లేదా చమురు నింపి వత్తి వేసి దీపాన్ని వెలిగించే వారు.
అంటే ఇక్కడ స్నేహమును నూనె లేదా చమురుగా, స్నేహానికి ప్రతీకగా భావించవచ్చు. స్నేహితుని వలె మానవునికి సహాయపడుతుందన్న మాట.
 అలాగే స్వయంప్రకాశకమైన మహోన్నత దీపం సూర్యుడేనని మనందరికీ తెలిసిందే.ఆయన అందరి బంధువు.మనందరికీ  జవ జీవాలను ఇచ్చే  స్నేహ దీపం సూర్యుడే.
 ఈ స్నేహ దీపాల్లా మనమూ  మన మిత్రులకు, అవసరమైన వారికి భరోసా దీపాలమై వెలుగులను పంచి సహాయపడుదాం. "స్నేహ దీప న్యాయానికి" మన వంతు న్యాయం చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు