సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -348
స్థూణాని ఖనన న్యాయము
****
స్థూణ అనగా స్తంభము, ఇనుప ప్రతిమ.ఖననము అనగా త్రవ్వుట అని అర్థము.
స్తంభము పాతిన తర్వాత అది అటూ ఇటూ ఊగకుండా దృఢముగా, కదలకుండా ఉండేందుకు ఆ స్తంభము చుట్టూ మట్టి కూరుతారు.అలా మట్టి కూరుతూ  గట్టిగా భూమిలో కదలకుండా ఉందా లేదా అని పదే పదే ఊపుతూ గట్టిగా కదలకుండా ఉండేటట్లు దృఢము చేస్తారు.
అలా ఒక విషయాన్ని మొదట చెప్పిన తరువాత అది అందరూ ఒప్పుకునే విధంగా దానిని బలపరిచేందుకు చేసే ప్రయత్నాన్ని ఈ "స్థూణాని ఖనన న్యాయము"తో  పోలుస్తూ వుంటారు.
దీనికి సంబంధించిన ఓ ఉదాహరణ చూద్దాం.
 ఏదైనా కీలకమైన విషయాన్ని, లేదా సమాచారాన్ని ఎదుటి వారికి అందజేసే సమయంలో ఆ సమాచారము కానీ విషయము కానీ వారికి తెలుసా? తెలియదా? చెప్పబోయే విషయాలతో వారు ఏకీభవిస్తారా?విభేదిస్తారా? చెప్పే విషయము వారి జీవితానికి అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుందా? ఇలా చెప్పే విషయం పై ‌స్పష్టత ఉండాలి. దీని ద్వారా సాధించాలనుకునే లక్ష్యం అనేది ఉండాలి.అప్పుడు  చెప్పే విషయాన్ని  బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. దానిని వాళ్ళంతా బలపరిచేలా చేయవచ్చు.అలా చేసే ప్రయత్నంలో విజయం సాధించడమే ఈ "స్థూణాని ఖననం".
ఇలా  చెప్పబోయే, లేదా చేయబోయే విషయాన్ని ప్రత్యేకంగా గుర్తింపబడేలా, ముఖ్యంగా అది నిరూపించడానికి  స్పష్టమైన ఋజువులు,ఇతర సమాచారము దగ్గర వుండాలి.
అలా సత్యా సత్యాలు తెలుసుకుని మంచి పనులు చేసేవారిని అందరూ మెచ్చుకుంటారు, బలపరుస్తారు అనే అర్థం వచ్చేలా కవి గువ్వల చెన్న రాసిన ఈ కంద పద్యాన్ని చూద్దామా...
"నిత్యానిత్యము లెఱుగుచు/ సత్యంబగు దాని దెలిసి సత్కృత్యములన్/ నిత్యము జేయుచు దశది/క్త్పుత్యముగా మెలగుమన్న గువ్వల చెన్నా!"
"ఏది స్థిరమో ఏది కాదో తెలుసుకోవాలి.అలాగే సత్యం ఏమిటో కూడా తెలుసుకోవాలి.ఇలా తెలుసుకుని సత్యమైన మంచి పనులనే నిత్యం చెయ్యాలి.అలా చేస్తూ దశ దిక్కుల నుంచీ ఓహో! శభాష్! అంటూ మన్ననలు అందుకుంటూ బతకాలి"అంటారు.
కాబట్టి మనం చెప్పే విషయం మీద పూర్తి అవగాహన,పట్టు ఉండాలి.ముందుగా ఆ విషయానికి సంబంధించి పూర్తి అధ్యయనం  చేసినట్లయితే ఎవరు ఏ ప్రశ్నలు,సందేహాలు సంధించినా శాస్త్రీయంగా, ఉదాహరణ యుక్తంగా వివరించగల నేర్పు,  నైపుణ్యం అనేవి విషయమనే స్తంభాన్ని దృఢపరిచే మట్టి కూర్పు లాంటిదన్న మాట.
ఇదండీ"స్థూణాని ఖనన న్యాయము"లోని అసలైన అంతరార్థము.ఇలా మనము కూడా ఓ మంచి పనికి పూనుకుందాం.అది ఎందుకు? ఎలా మంచిదో ?  కొందరైనా మనల్ని బలపరిచేలా చూసుకుంటూ అనుకున్న లక్ష్యం వైపు అకుంఠిత దీక్షతో సాగిపోదాం. మరి మీరేమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు