సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -351
స్ఫటిక లౌహిత్య న్యాయము
******
స్ఫటికము అంటే పటిక రాయి, గులకరాయి అనే అర్థాలు ఉన్నాయి.లౌహిత్యం అనగా లోహితము,అరుణిమ, ఎరుపుగా వుండటం అని అర్థం.
స్ఫటికము దగ్గర జపా పుష్పము అంటే  మందారము,మంకెన పువ్వు ఉంచితే  స్ఫటికము ఎఱ్ఱగా కనిపిస్తుంది.ఆ పుష్పాన్ని తీసివేస్తే స్ఫటికము మళ్ళీ మామూలుగా అవుతుంది.
ముందుగా మనం స్ఫటికము గురించి కొన్ని విశేషాలు , విషయాలను తెలుసుకుందాం.
స్ఫటికము రంగులేని పారదర్శకమైన స్వచ్ఛమైన,చల్లని ప్రభావపూర్వకమైనది.ఇది సాధారణంగా గాజు ముక్కను పోలి వుంటుంది.స్ఫటికమును ఆంగ్లంలో "క్రిస్ఠల్" అంటారు.
భూగర్భ శాస్త్రములో స్ఫటికము అనేది ఒక ఖనిజము.భూమి యొక్క ఖండాల ఉపరితల పొర లోపల ఉన్న వాటిలో ఫెల్డ్ స్పెర్ తర్వాత దొరికే రెండవ అత్యంత దృఢమైన ఖనిజము.
ఇలా చాలా సులభమైన మరియు అంతర్గతంగా చాలా స్పష్టమైన స్ఫటిక నిర్మాణములో వజ్రం కూడా ఒకటి అని శాస్త్రవేత్తలు చెప్పారు.
మరో విశేషం ఏమిటంటే ఈ స్ఫటికానికి  సంబంధించిన ఓ ప్రత్యేక శాస్త్రమే ఉంది.ఔషధ నమూనా చాలా బలంగా స్ఫటిక శాస్త్రం మీద ఆధారపడటం విశేషం.ఆరోగ్యం మరియు భద్రతా సూచనలకు అనుగుణంగా వుండే విధంగా స్ఫటిక శాస్త్రం దోహదపడటం మనం గమనించవచ్చు.ఈ విధంగా మన జీవన నిర్మాణానికి సంబంధించిన కొన్ని రహస్యాలను బహిర్గతం చేయడానికి ఈ శాస్త్రం ఎంతో ఉపయోగపడిందని 18,19 శతాబ్దంలోనే శాస్త్రవేత్తలచే నిరూపించబడింది.
ఇక మానవ స్వభావాన్ని స్వచ్ఛమైన స్ఫటికముతో పోల్చడం మనందరికీ తెలిసిందే. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని పోలుస్తూ స్ఫటికముతో వుంటారు.
ఈ విషయం కృష్ణ-యజుర్వేదం యొక్క యోగతత్వ ఉపనిషత్తులో చెప్పబడింది.యోగాలో వ్యక్తి సమాధి స్థితి గురించి చెబుతూ యోగాలో నిమగ్నమైన వ్యక్తి సర్వ పాపాలను నాశనం చేసే స్వచ్ఛమైన స్పటికం లాంటి సర్వోన్నతమైన ఆసనాన్ని పొందుతాడని ఈ వేదం చెబుతోంది.
స్ఫటికమును స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారని మనం పై విషయాల ద్వారా గ్రహించాం కదా!.దీనినే మనసుకు అన్వయించి చెప్పారు మన పెద్దలు.
మనసు స్ఫటికము వలె స్వచ్ఛమైనది అయినప్పటికీ వ్యామోహాలు, కోరికలు అనెడి రంగులకు ఆకర్షింపబడుతుందని చెప్పారు .అలా స్ఫటికము దగ్గర జపా పుష్పము పెట్టి స్ఫటికము కూడా ఆ రంగును పొందడం చూపి మరీ నిరూపించారు .
అలా మనసు ఎంత స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉన్నప్పటికీ చుట్టూ సమాజంలో ఉన్న వ్యక్తులు, సంఘటనలు, సన్నివేశాలు మనసును ప్రభావితం చేస్తాయని చెప్పడం కోసమే ఈ "స్ఫటిక లౌహిత్య న్యాయము" ను మన పెద్దలు సృష్టించారని అర్థం చేసుకోవచ్చు.
అయితే ఆయా వ్యామోహాలు, కోరికలను దరిచేరనీయకుండా సదా ప్రయత్నం చేయాలి.అలా వాటి నుండి విడివడినప్పుడే అసలైన ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది.మనసు కుదురుగా వుండి తద్వారా ఆత్మానందం పొందుతాం.
ఈ విషయాన్ని  ప్రతి క్షణం గమనంలో పెట్టుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు