వాగ్యజ్ఞం - సి.హెచ్.ప్రతాప్
 ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచి అతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేగాని మరియంట నేర్చునా !
విశ్వదాభి రామ వినురవేమ!
అర్ధం: ఇనుము విరిగినచో , ఎర్రగా కాల్చి మ‌ళ్లీ అతికేలా చేయ‌వ‌చ్చు. అదే మనసు విరిగిపోతే తిరిగి క‌ల‌ప‌టం అసాధ్యం. అందుకే ఎవ్వరి మ‌న‌సు నొప్పించకూడదు.
ప్రజాకవి వేమన ఇతరులతో ఈ లౌకిక జీవితంలో ఎలా వ్యవహరించాలో అత్యధుతంగా ఈ పద్యంలో వివరించారు. అందుకే మాట్లాడడాన్ని వాగ్యజ్ఞం అని అన్నారు. వివేకులు ధనమును దుర్వినియోగం చేయని రీతిలో
వాక్కు దురుపయోగం తగదని శాస్త్రం చెబుతోంది. ప్రతీ అక్షరం ఒక పుష్పంలా భగవంతుని పాదాలను అర్చించాలి. పవిత్ర పూజా ద్రవ్యంలా వాక్కును పవిత్రీకరించుకోవాలి.వాగ్యజ్ఞం మన కర్తవ్యం కావాలి.
జిహ్వ సార్ధక్యాన్ని సాధించుట పలికిన ప్రతీ మాట
శుభ శబ్దం, శుభంకరం కావాలన్నదే మన ప్రతిజ్ఞ.  జీవితంలో, జీవితాంతం వాక్కుతో యజ్ఞం చేసేవారున్నారు. హరిశ్చంద్రుడు అలా చేశాడు. నోట్లోంచి వెలువడిన ప్రతి మాటను సత్యంగా మలచుకున్నాడు. ఆ క్రమంలో- చక్రవర్తి హరిశ్చంద్రుడు రాజ్య సర్వాన్నీ పోగొట్టుకున్నాడు. భార్యాబిడ్డలను కోల్పోయాడు. కాటికాపరి అయ్యాడు. కుమారుడికి స్వయంగా శవదహనం చేసేందుక్కూడా సిద్ధమయ్యాడు. ఎన్ని కష్టాలు పడినా ఆయన సత్యాన్ని మాత్రమే మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాటను సత్యం చేశాడు. సత్యాన్ని పాలించటమే తన యజ్ఞంలా భావించాడు.

కామెంట్‌లు