భం భం చుక చుక - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 దేవలోకంలో ఒక రాజు వుండేటోడు. ఆయన చానా బలవంతుడు. బాగా డబ్బున్నోడు. అంతేగాక మంచి అందగాడు. దాంతో పొగరు బాగా తలకెక్కింది. తనంతటోడు ఎవడూ లేడని విర్రవీగేటోడు. కనబడినోళ్ళనంతా అవహేళన చేసేటోడు. చిన్నా పెద్దా పట్టిచ్చుకునేటోడే కాదు. 
ఒక రోజు ఒక ముని దేవలోకానికి వచ్చినాడు. ఆయన కొంచం పొట్టి. కానీ వేదవేదాలు చదివినోడు. అటువంటి ముని వచ్చేసరికి అందరూ గౌరవించేవాళ్ళు. కానీ ఈ రాజు కొంచం గూడా లెక్కచేయకుండా ''భూమికి మూడడుగులు లేవు కానీ వేదవేదాలు చదివినావా... ఐనా ఏం లాభం అవన్నీ ... నాలాగ అందం, డబ్బు లేనప్పుడు'' అంటా ఆట పట్టిచ్చినాడు. దాంతో ఆ మునికి చానా కోపం వచ్చింది. 
'' రాజనేటోడు ఎదుటి వాని చదువుకు, వయసుకు విలువనివ్వాలి. కొంచం గూడా వినయం లేని నీలాంటోడు రాజుగా అస్సలు పనికిరాడు. నువ్వు ఈ దేవలోకంలో పుట్టినా ఆ గుణాలు నీలో ఒక్కటీ లేవు. నీలాంటి రాక్షసులు వుండవలసింది అడవిలోనే'' అంటా కోపంగా ''నీవు భూమ్మీద మనుషులు తొంగిచూడని ఒక భయంకరమైన అడవిలో మర్రిచెట్టువై, రాక్షస ఆకారంలో పడుండు'' అని శపించినాడు. 
ఆ దెబ్బకు రాజు అదిరిపన్నాడు. భయంతో వణికిపోయినాడు. ముని కాళ్ళమీద పడి ''సామీ.. పిల్లలు తప్పు చేసినప్పుడు తిట్టో, కొట్టో, బుజ్జగించో దారికి తేవాలి గానీ మరీ ఇంత శిక్షనా... మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి'' అన్నాడు కళ్ళనీళ్ళతో. 
మంచివాళ్ళ కోపం తామరాకు మీది నీటిబొట్టు మాదిరి ఎక్కువ సేపు నిలబడదు గదా.... దాంతో ఆ ముని బాగా ఆలోచించి ''ఒకసారి శాపం ఇచ్చినా వెనక్కు తీసుకోలేం. నీవల్ల ఎప్పుడైనా ఒక ఊరు బాగుపడి ఆ జనాలంతా నిన్ను మెచ్చుకుంటే అప్పుడు నీవు మళ్ళీ మామూలుగా అయిపోతావు'' అన్నాడు. 
అప్పటి నుంచి ఆ రాజు భూమ్మీద భయంకరమైన మర్రిచెట్టు ఆకారంలో పడుండి... 'ఎవరు వచ్చి తనను విడుదల చేసి పోతారా' అని ఎదురుచూడసాగినాడు. అడవిలోకి ఎవరైనా వచ్చినా, ఈ భయంకరమైన ఆకారం చూసేసరికి రాక్షసుడేమో అని భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయేటోళ్ళు. ఆ మర్రిచెట్టు ఎంత పిలిచినా ఎవరూ దగ్గరికి వచ్చేటోళ్ళు కాదు. నెమ్మదిగా ఆ విషయం చుట్టుపక్కలంతా తెలిసిపోయింది. 'అడవిలో ఒక రాక్షసుడు తిరుగుతా వున్నాడు. దొరికినామంటే చంపుకొని తింటాడు' అని భయపడి జనాలు రావడమే మానేసినారు. పాపం... ఆ రాజు ఒక్కడే బాధపడుతా ఎదురుచూడసాగినాడు. 
ఆ అడవి పక్కనే రామాపురం అనే ఒక వూరుంది. ఆ వూరిలో శివయ్య అని ఒక రైతున్నాడు. అతను చానా మంచోడు. వూరిలో అందరికీ తలలో నాలుకలా వుంటా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటా వుండేటోడు. ఒకసారి ఆ వూరికి పెద్ద కరువు వచ్చింది. వానలు లేక పంటలు లేక జనాలంతా అల్లాడిపోసాగినాడు. తినడానికి తిండి లేక మనుషులు, గడ్డి లేక పశువులు ఎక్కడివక్కడ చచ్చిపోసాగినాడు. కళ్ళ ముందే అందరూ చచ్చిపోతా వుంటే ఆ రైతుకు చానా బాధ వేసింది. దాంతో ఎక్కడన్నా ఏమన్నా దొరికితే పట్టుకొద్దామని ఆ అడవిలోనికి బైలుదేరినాడు. అది చూసి జనాలు '' వద్దొద్దు... లోపల ఒక భయంకరమైన రాక్షసుడు వున్నాడు. వానికి కనబడితే అంతే! దొరికినోన్ని దొరికినట్టు చంపుకొని తింటాడు'' అంటా భయపడిచ్చినారు. దానికా రైతు నవ్వి '' ఇక్కడ తిండి లేక చావడం కన్నా పోయి ఆ రాక్షసునికి ఆహారం కావడమే మంచిది'' అనుకుంటా ఆ అడవిలోకి బైలుదేరినాడు. 
అలా పోతా వుంటే ఒకచోట ఈ భయంకరమైన మర్రిచెట్టు కనబడింది. అది వీన్ని చూసి ''అనా.. అనా... ఇటురా'' అని పిలిచింది. రైతుకు దాన్ని చూడగానే గుండె గుభేలుమనింది. కానీ చావుకు సిద్ధపడే వచ్చినాడు గదా... దాంతో కొంచం గూడా బెదపడకుండా ''ఎవరు నువ్వు... ఈ అడవిలో ఎందుకు అందరినీ చంపుతా వున్నావు'' అనడిగినాడు. దానికా మర్రిచెట్టు నవ్వి ''మనుషులు అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకం. నేను ఇక్కడి నుంచి కదలుతే గదా చంపేది. నా ఆకారం చూసి భయపడి లేనిపోనివన్నీ చెప్పుకోని ఈ అడవిలోనికి రావడమే మానేసినారు.'' అంటా తన కథంతా చెప్పి... ''నీవు నీ వూరికి పో... వూరు వూరంతా సంబరపడేటట్టు, అందరూ నన్ను మెచ్చుకునేటట్టు ఏదయినా ఒక మంచి పని చేయి. నీవు నన్ను మనసులో తలచుకొని ''భం... భం... చుకచుక '' అని ఒకసారి అనుకో చాలు.. నీవు కోరుకున్నంత ధనం నీ ముందుంటాది' అని చెప్పి పంపిచ్చింది. 
ఆ రైతు సంబరంగా ఇంటికి వచ్చినాడు. 'వూరందరికీ ఉపయోగపడే పని ఏం చేయాలబ్బా' అని బాగా ఆలోచించినాడు. అక్కడికి చానా దూరంలో ఒక నది పారతా వుంది. దానిలో ఎప్పుడూ నీళ్ళుంటాయి. ఆ నది నుంచి ఒక కాలువ గనుక తవ్వుకుంటే చాలు, వూరు వూరంతా పచ్చగా మారిపోతాది. ఆ మర్రిచెట్టు ఇచ్చే ధనంతో అంతా తానే చేయోచ్చు. కానీ దాని వలన జనాలకు పని విలువ తెలీదు. అందుకని వూరందరినీ ఒకచోట జమ చేసి ''మన కరువు తీరాలంటే, తరతరాలు హాయిగా కాలు మీద కాలేసుకోని కలకాలం బతకాలంటే ఒక్కటే దారి. దూరంగా పారతా వున్న ఆ నది నీళ్ళను మన వూరివైపుకు మళ్ళించడమే. అడవిలో అనుకోకుండా నాకు ఒక పెద్ద నిధి దొరికింది. కానీ అదొక్కటే ఇంత పెద్ద పనికి సరిపోదు. ఇంటికొకరు చొప్పున వచ్చి వుచితంగా పని చేయాలి. ఏం సరేనా'' అన్నాడు. 
జనాలంతా కాసేపు తమలో తాము బాగా ఆలోచించుకోని ''అన్నా... మన వూరి బాగు కోసం మనం పని చేయడంలో తప్పేముంది. చేయీ చేయీ కలిపితే కొండలనైనా పిండి కొట్టావచ్చు. ఇంటికి ఒకరేంది వూరువూరంతా దీనికి సిద్ధం. మాకు పనయ్యేంత వరకు పంచభక్ష పరమాన్నాలు పెట్టకపోయినా కడుపు నిండా తిండి పెట్టు చాలు'' అన్నారు. దాంతో ఆ రైతు 'సరే' అన్నాడు. 
తరువాత రోజు నుంచీ ఆ వూరువూరంతా పనిలోకి దిగినారు. ఆడతా, పాడతా అలసిపోకుండా పని చేయసాగినారు. డబ్బు అయిపోయినప్పుడల్లా ఆ రైతు ''భం..భం.. చుకచుక'' అంటా కావలసినంత తెచ్చుకోసాగినాడు. అలా ఏడాది కాలం అనుకున్నది కేవలం ఆరు నెలల్లోనే కాలువ తవ్వడం అయిపోయింది. దాంతో నీళ్ళు వాళ్ళ పంట పొలాల్లో గలగలగల పారినాయి. ఎండిపోయిన భూములన్నీ మళ్ళీ పచ్చగా కళకళలాడినాయి. జనాలంతా ఆనందంగా సంబరాలు చేసుకుంటా ఆ రైతును పైకి ఎత్తుకున్నారు. 
అప్పుడా రైతు నవ్వి ''ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అంతా అడవిలోనున్న రాక్షసుని చలవే. మీరందరూ భయపడుతున్నట్టు అతను రాక్షసుడు కాదు. ఒక దేవతల రాజు'' అంటా జరిగిందంతా చెప్పినాడు. దాంతో వూరి జనాలంతా అడవిలోకి పోయి ఆ మర్రిచెట్టుకు మొక్కి ''రాజా... నీవల్లనే ఈ రోజు వూరువూరంతా మూడు పూటలా అన్నం తింటా వుంది. నీవు చేసిన మేలు ఎప్పటికీి మరువం'' అన్నారు సంతోషంగా... ఆ మాటలు వాళ్ళ నోళ్ళలోంచి వచ్చిన మరుక్షణం ఆ మర్రిచెట్టు అక్కడి నుంచి మాయమై దేవతలరాజుగా మారిపోయింది. 
ఆ దేవతలరాజు రైతును పిలచి '' నీ వల్లే మరలా నాకు ఈ రూపం తిరిగి వచ్చింది. నీకు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సరే.. భం... భం... చుకచుక అంటా నన్ను తలచుకో. కళ్ళు మూసి తెరిచేలోగా నేను నీ కళ్ళ ముందుంటాను'' అని చెప్పి రైతుకు, వూరివాళ్ళకంతా రకరకాల కానుకలు ఇచ్చి అక్కడినుంచి మాయమైపోయినాడు.
***********

కామెంట్‌లు