విద్యారంగానికి కాయకల్ప చికిత్స- సి.హెచ్.ప్రతాప్

  నూతన జాతీయ విద్యా విధానం లో భాగం గా విద్యా రంగం లో సంస్కరణలు చేపట్టేందుకు తగిన సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కస్తూరి రంగన్ కమిటీ ఎన్నో విలువైన సూచనలు ఇచ్చింది. అందులో ముఖ్యం గా ఆంగ్లాన్ని కార్య భాషగా గుర్తించి అన్ని స్థాయిలలో సముచిత ప్రాధాన్యత కల్పించాలన్న సూచన సహేతుకంగా వుంది. ఇప్పటికే తగిన ప్రావీణ్యం లేని కారణం గా గ్రామీణ ప్రాంత విద్యార్ధులు  కార్పొరెట్ సంస్థలలో వున్న అసంఖ్యాక అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారనేది కఠోర వాస్తవం. ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషతో పాటు ఆంగ్లాన్ని కూడా దీటుగా నేర్పించాలని గతం లో సుబ్రమణియన్ కమిటీ చేసిన సిఫార్సులు బుట్టదాఖలు అయ్యాయి. అయితే 2009 నుండి ఉమ్మడి రాష్ట్రం లో అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు కార్పొరేట్ తరహాలో ప్రారంభమైనా అవి అంతంత మాత్రం గానే ఫలితాలనిస్తున్నాయి.దేశవ్యాప్తం గా త్రి భాషా సూత్రాన్ని అమలు పరచాలని కస్తూరి రంగన్ కమిటీ సూచించడం, అందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం గా స్పందించడం సమంజసంగా వుంది.  రెండు నుండి ఎనిముదేళ్ళ వయసులో పిల్లలు సహజసిద్ధంగా బహు భాషలను నేర్చుకునే ప్రజ్ఞ కలిగివుంటారు కనుక త్రిభాషా సూత్రం  అనేక మంచి ఫలితాలను ఇస్తుందన్న సదరు నివేదిక సహేతుకంగా వుంది.  అయితే ఈ నివేదికలోని అంశాలపై విపక్షాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం అర్ధం కాని విషయం. దేశం లో ఆంగం కార్య భాషగా, హిందీ వాడుక భాషగా చెలామణీ అవుతోంది. మంచి ఉద్యోగాల కోసం ఈ రెండింటి పట్ల పట్టు సాధించడం ఎంతో అవసరం. వీటికి అదనం గా కమిటీ నివేదిక మాతృభాషను నేర్చుకోమని చెప్పడం సహేతుకంగా వుంది.   2008లో నాటి యూపీఏ ప్రభుత్వం హిందీ వినిమయాన్ని పెంచడానికంటూ మెట్రిక్, ఆ పై స్థాయి అభ్యర్థులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదన పెట్టింది. అందరూ నిరసించడంతో వెనక్కి తగ్గింది. ఇంకా వెనక్కు వెళ్తే 1960 ప్రాంతాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తమిళనాడులో ఉద్యమాలు చెలరేగాయి. భాషను ఇష్టంగా నేర్చుకున్నప్పుడే అందులోని మెలకువలు పట్టుబడతాయి. ఏ భాష అయినా సహజ పద్ధతుల్లో వికసించాలిఅయితే 1968 లోనే ఇటువంటి విధానాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా అది ఎక్కడా సంతృప్తికరం గా అమలుకాలేదన్న అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని వర్తమానం లో మరింత కట్టుదిట్టంగా ప్రణాళికలు అమలుచేయడం ఎంతో అవసరం. మన విద్యా సంస్థలలో కేంద్రీయ విద్యా సంస్థలలో తప్పిస్తే మాతృభాష, ఆంగ్లానికి తోడు మరొక భాషను నేర్పించేందుకు అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు లేరు.పాఠ్యపుస్తకాలు కూడా సమగ్రంగా,శాస్త్రీయవిధానం లో రూపొందించినవి లేవు.పైగా భాషను నేర్చుకోవడమే శుద్ధ దండుగ అని నూరి పోస్తున్న కార్పొరేట్ సంస్కృతిలో మూడు భాషలను తమ పిల్లలు నేర్చుకునేందుకు ముందు తల్లిదండ్రులను మానసికంగా సిద్ధం చేయవలిసి వుంటుంది. కమిటీ నివేదికను నూతన జాతీయ విద్యా విధానం అమలు నేపధ్యం లో పార్లమెంటులో సమగ్రంగా చర్చించి, అనంతరం అమలు చేయడం సబబుగా వుంటుంది.త్రిభాషా సూత్రం అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమ స్పూర్తితో కష్టపడితేగాని ఫలితం వుండదు. 
కామెంట్‌లు