పరోపకారం ఇదం శరీరం- సి.హెచ్.ప్రతాప్
 తరువు లతిరసఫలభార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము...!
భావం - బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపద వల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క తాత్పర్యం.
ప్రకృతినుండి లభించే చెట్లు, నదులు, సృష్టిలోని ఉత్కృష్టమైన జంతువు, ఆవులు నుండి మానవాళికి ఉపయోగమే తప్ప హానిలేదు.ఉత్కృష్టమైన మానవ జన్మ కలిగి ఉండి ఇతరులకి మేలు చేయక పోవడం, ఉపయోగపడకుండా ఉండడం అనేది ప్రకృతి సహజత్వానికి విరుద్ధం.అటువంటి జీవితం ఫలవంతం కాదు.
మానవ ఇతిహాసంలో ఉన్న అన్ని రకాల శాస్త్రాలు, ధర్మాలు అన్నీ పరోపకార హితానికై పాటుపడమని బోధిస్తున్నాయి.  పరోపకారమే పుణ్యము, ఇతరులను పీడించడము పాపం అని వక్కాణిస్తున్నాయి.
వేలమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తున్నారు. జపతపాలు చేస్తున్నారు. కానీ, మనసులో గూడు కట్టుకుని ఉన్న పాపాలు, స్వార్థం లాంటివి వదలడం లేదు. చిత్త శుద్ధి లేని యాత్రలు పూజలు ఎన్ని చేసినా ఫలితం మాత్రం శూన్యం అని శాస్త్రం చెబుతోంది. అది మనం కూడా అర్థం చేసుకొని….
మానవ సేవే మాధవ సేవ అనుకొని పరులకు మన చేతనైన సహాయం చేసి పరోపకారార్థం ఇదం శరీరం అనే లోకోక్తిని కాపాడాలి. 

కామెంట్‌లు