మకర సంక్రాంతి పద్యాలు;- వరలక్ష్మి యనమండ్ర
 (1)
సంక్రమణము నందు సన్నగా సూరీడు
కాలుపెట్టునంట గడిని దాటి
ధనువు దాటినంత తానేగు మకరాన
సంబరములు జరుగు సంతసముగ
(2)
పంటలన్ని నిండు బస్తాలలో జేరు
పాడి వృద్ధి జరిగి భవిత వెలుగు
వరములిచ్చు మనకు వ్యవసాయదారుడే
పొలములన్ని పండి పుడమి మురియు
(3)
క్రొత్తకుండలోన క్రొత్త బియ్యమువేసి
పాలుబోసి జనులు వండెదరుగ
కుండలోన తీపి క్రొత్తబెల్లము దెచ్చు
పొంగలిని తినగనె పొంగు సిరులు
(4)
రంగవల్లులందు రమ్యంపు గొబ్బిళ్ళు
కనులవిందుజేయు కన్నెలంత
హరిని గుర్తుజేయు హరిదాసు కీర్తనల్
భక్తిభావములను పంచిపెట్టు
(5)
గంగిరెద్దు వచ్చు!ఘనమైన సన్నాయి
బుడబుడకలవారు ముందు నడుచు!
హ్లాదమిచ్చు క్రాంతి!అందాల సంక్రాంతి!
శుభముగలుగు మీకు!సుదతులార!
*********


కామెంట్‌లు