విధిగా ఓటును వినియోగించు

 ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదవ్వాలని, ఓటు ఉన్న ప్రతి ఓటరూ విధిగా ఓటును వినియోగించుకోవాలని, తద్వారా మన ప్రజాస్వామ్య దేశానికి సేవ చేసిన వారౌతారని వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఓటును వినియోగించుకోవాలని నాగమణి అన్నారు. ఉపాధ్యాయులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, ప్రజలు, 
విద్యార్థులచే ఆమె ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ గావించారు. ప్రతి ఎన్నికల్లోనూ నిర్భయంగా ఓటును వేస్తామంటూ ప్రతిజ్ఞ గావించారు. పాఠశాల ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు ఓటుచైతన్యం గూర్చి స్వీయగీతాలను ఆలపించారు.
అనంతరం విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, వాలంటీర్లతో గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. 
బుల్లెట్ కన్నా బాలెట్ మిన్న, 
ఓటు హక్కు మన జన్మ హక్కు, 
ఓటరుగా గర్వపడు ఓటేసి సంతృప్తి పడు, ఓటరూ మేలుకో నీ జగతిని ఏలుకో వంటి నినాదాలతో ర్యాలీ గ్రామమంతా హోరెత్తింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులు పాల్గొని ప్రసంగించారు. స్థానిక సచివాలయం విద్యా సంక్షేమ కార్యదర్శి ఆర్.కిషోర్, సర్వేయర్ ఎం.అమ్మన్నమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు ఎ.వెంకటమ్మ, బి.సుబ్బలక్ష్మి, గ్రామ వాలంటీర్లు వి.ప్రకాష్, ఎం.శివ, ఎన్.శిరీష, కె.గీత, వి.పగడాలు, కె.కళ్యాణి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
కామెంట్‌లు