సుప్రభాత కవిత ; - బృంద
ప్రాగ్దిశను విరుస్తోన్న
వెలుగుపువ్వు సుగంధం
వెలుతురై వసుధను
కౌగిలించేవేళ...

దట్థమైన వనంలోన
దళసరి కొమ్మల సందున
సంధించిన శరంలా
చొచ్చుకునిపోయే వేళ

మధువనంలో అరవిరిసిన
మందారాల మకరందాలు తాగి
మురిసిన మధుప బృందాలు
మధురగీతాలు  పాడేవేళ..

చుక్కలదారిలో మబ్బులు
చక్కగ రంగులు నింపి
నింగి నీలపు యవనికపై
రంగవల్లులెన్నో  రచించేవేళ...

మత్తుగ నిదరోయే జగతికి
కొత్తగ సొగసులు అద్దుతూ
గుత్తుగ కిరణాల పంపుతూ
చిత్తుగ చీకటిని ఓడించేవేళ...

ఎర్రటి పొత్తిళ్ళలో  నవ్వే
బంగారు వన్నె భానుడు
గగనపు  ముంగిట మెరిసి
భువనానికి పండుగ తెచ్చేవేళ

ఎగిరేటి గువ్వల కువకువలూ
సెలయేటి మువ్వల గలగలలూ
కురిసేటి రవ్వల మిలమిలలూ
ఎలదేటి నవ్వుల సరిగమలూ..

మనసంత మనసైన
పరిమళం నింపే వేకువకు

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు