సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -367
అగతిక గతి న్యాయము
*****
అగతి అంటే ఆశ్రయము లేమి, మార్గము లేమి.అగతికుడు గతిలేని వాడు.గతి  అంటే పోక, త్రోవ, ఉపాయము, శరణము, విధము,దశ, ఆధారము, చలనము,నడక, ప్రవేశము,స్వర్గ ప్రాప్తి, బ్రతుకు దెరువు, ఫలితము అనే అర్థాలు ఉన్నాయి.
గతిలేని వాడు ఏదో ఒక గతి చూచుకొనునట్లు.
 దీనిని తెలుగులోని "గతిలేనమ్మకు  గంజే పాయసం" అనే సామెతతో పోల్చవచ్చు.
ఈ న్యాయమును ముఖ్యంగా ఆర్థిక లేమికి,మానసిక ఒంటరితనానికి సంబంధించినదని చెప్పవచ్చు. అది స్త్రీనా ,పురుషుడా అని కాదు. ఇద్దరిలో ఎవరికైనా వర్తింపజేయవచ్చు.
 ఈ రోజుల్లో ఒంటరి మహిళలూ ఉన్నారు.ఒంటరి పురుషులూ వున్నారు.ఆర్థిక లేమితో బాధపడుతూ పూటకు పిడికెడు అన్నం తినేందుకు లేని అన్నార్తులు,మందూ మాకూ కొనుక్కోవడానికి  చేతిలో చిల్లిగవ్వ కూడా లేక బాధ పడేవారు మన చుట్టూ కనిపిస్తూ వుంటారు.
అయితే అలాంటి వారు తమ దైనందిన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్న మనకు వస్తుంది.
అది "అగతిక గతి న్యాయము"లోనే వుంది ఏదో ఒక గతి చూసుకోవడమని.
పరువు పేరుతో ఏ దిక్కూ చూసుకోకుండా అలమటిస్తున్న వారు ఇంకా కొందరు ఉన్నప్పటికీ నేడు చాలా మంది తమకు వచ్చిన నైపుణ్యాలకు పదును పెట్టుకుని ఆత్మ శక్తితో ఏదో ఒక రకంగా జీవనాన్ని సాగిస్తున్నారు.పచ్చళ్ళు, ఊరగాయలు అప్పడాలు,వడియాలు పిండివంటలు చేయడం తెలిసిన వారికి చేసి పెడుతూ తృణమో పణమో పొంది బతుకును వెళ్ళదీస్తున్నారు.
ఇంకా ఈ మధ్య కాలంలో మన చుట్టూ ఉండే అలాంటి వారు కొందరు పొద్దు పొద్దున్నే ఇడ్లీ,వడ మొదలైనవి చేసుకుని వీధుల్లో తిరుగుతూ అమ్ముకోవడం లేదా ఓ తోపుడు బండి మీద పెట్టుకొని జన సంచారం ఎక్కువగా ఉన్న చోట పెట్టి ఇతరులపై ఆధారపడకుండా జీవించడం చూస్తున్నాం.
ఒంట్లో అంతో ఇంతో శక్తి వున్నవారు ఈ విధంగా బతుకుతున్నారు.మరి పూర్తిగా ఇతరులపై ఆధారపడే వారి పరిస్థితిని చూస్తుంటే కళ్ళనీళ్ళు  పెట్టుకోకుండా ఉండలేం.
"నీ దిక్కు గానివారికి/నేదిక్కును లేదు వెదక నిహపరములకున్/మోదింప దలచు వారికి/నీ దిక్కే దిక్కు సుమ్ము నీరజనాభా!"
ఓ పద్మనాభా! నువ్వే దిక్కు అనుకోని వారికి ఎంత వెదికినా దిక్కు వుండదు అనగా శరణు దొరకదు.ఈ లోకంలోనూ,పర లోకంలోనూ  ఆనందంగా ఉండాలని అనుకునే వారికి నువ్వే ఆధారం"అని భావం.
అలాంటి దిక్కు లేని వారిని చూసేందుకు కొన్ని ఆశ్రమాలు వెలిశాయి. అవి భగవంతుడే తమకో దారి  దిక్కు చూపించాడనీ,తమ లాంటి వారి కోసమే  సృష్టించాడని భావిస్తూ, అక్కడికి వెళ్లి కొందరు జీవనం కొనసాగిస్తున్నారు.
 కరోనా సమయంలో  కొందరిలో మానవత్వం మృగ్యమైన వేళ కొందరు "దైవం మానుష రూపేణ" అన్న విధంగా  కరోనా  నెపంతో ఇంట్లోంచి వెళ్ళగొట్ట బడిన వారిని అక్కున చేర్చుకున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలను గురించి ,వ్యక్తుల చదివినప్పుడు ఇంకా సమాజంలో మానవీయ విలువలు బతికే ఉన్నాయని అనిపించింది.అలాంటి వారి గురించి దైవ భక్తి ఉన్న వ్యక్తులు "ఏదిక్కూ లేని వారికి ఆ దేవుడే ఈ ఏర్పాటు చేశారని అనుకోవడం "మనకు తెలుసు.
 కొంచెం  ఎక్కువగా రాశానని అనిపించింది కానీ ఈ "అగతిక గతి న్యాయమే" ఇలా నాతో రాయించింది.
 అయితే వీళ్ళే కాకుండా అన్నీ వుండి పలకరించే దిక్కు లేక బతుకీడ్చే  వారు కూడా మనకు చుట్టూ ఉన్న వారిలో కనిపిస్తూ వుంటారు.
మన వంతుగా మన చేతనైనంత ఆర్థిక సాయమో, లేదా ఆత్మీయ పలకరింపుల హార్దిక సాయం చేస్తే వారి దృష్టిలో  బతుకు పయనంలో భరోసా ఇచ్చేవారు ఇంకా ఈ సమాజంలో ఉన్నారనే నమ్మకాన్ని కలిగిద్దాం.ఆత్మ సంతృప్తిని పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు