సుప్రభాత కవిత ; - బృంద
ఎదురూసే కనులకు
పండుగై
ఎనలేని హాయిని తెచ్చే
కబురై
ఎలదేటి పాడే పాటంత
మధురమై
ఎలనవ్వులు కమ్మగ విరిసే
మధువనమై

వచ్చే వేకువ

ఏటి ఒడ్డున వయ్యారంగా
ఏపుగ కంటికింపుగ పెరిగిన
ఏరువాకను నాటిన నారను
ఏకమై గాలితో నాట్యం చేయిస్తూ

వచ్చే వేకువ

కదిలి సాగే మబ్బులకు
చేయి ఊపుతు వీడుకోలుగా
మిన్ను చూస్తూ  ఊగిపోతూ
మన్నులోనే పైరు నర్తించినట్టు

స్వాగతించే వేకువ

మనసుపడి అక్కడే
మజిలీగా ఆగాలని
మది నిండుగ కోరికలూరగ
మనసారా సంతోషించే మానసంలా

నిండైన వేకువ

కమ్మగ పొడిచే పొద్దుకై
గమ్మున చూస్తూ నిలచి
దవ్వున ఎర్రని కాంతి చూసి
రివ్వుమని నింగికెగిరిన ఎదలా

పొంగే వేకువ

కోటికలలు కూర్చిన రూపమై
లక్ష సమస్యలు తీర్చే జవాబై
వేయి వరములు కట్టిన మూటై
రెండు కళ్ళ ముందు వెలుగుపంటై

ఆగమించే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు