పంచపది బసవ పురాణం;- కాటేగారు పాండురంగ విఠల్-పంచపది ప్రక్రియ రూపకర్త-హైదరాబాద్ 9440530763
 81
భూగర్భనిధి భాండాగారము చేరినది
బసవన్నపై రాజుకు గౌరవం పెరిగినది
రాజు నుంచి అపారధనం లభించినది
ఘనమైన సత్కారంకూడా లభించినది
బసవడు ధనం భక్తులకుపయోగిస్తాననె విఠల!
82
కులం ఈశ్వర నిర్మితం కాదని అన్నాడు
వృత్తులను బట్టే కులములని చెప్పాడు
శివుని దృష్టిలో అందరు సమమన్నాడు
దంభాచారములను తిరస్కరించినాడు
బసవడు మనుషులంత సమానమనె విఠల!
83
జనులందరు రాతిపామును అర్చిస్తారు
మళ్ళీ వారే జాతి నాగులను చంపేస్తారు
తిండి తినని లింగంకు తినమని చెప్తారు
అని ఆయన మూఢాచారాలు ఖండించారు
బసవడు శివ భక్తిని ప్రచారము చేసె విఠల!
84
మిథ్యా బ్రహ్మచర్యమును ఖండించినాడు
అతడింద్రియాల నిగ్రహాన్ని ప్రశ్నించినాడు
సతీపతుల సౌఖ్యము కూడదా?అన్నాడు
పంచేంద్రియాలు బాధపడవా?అన్నాడు
సిరియాళాది భక్తులు దీన్ని వదలలేదనె విఠల!
85
ఈ భువియే కైలాసమని బోధించినాడు
సచ్చినపిదప వచ్చేది స్వర్గంకాదన్నాడు
ధరణిలో చెల్లనిది ఎచ్చట చెల్లదన్నాడు
వైవాహిక బంధము గొప్పదని అన్నాడు
బసవడునిరీశ్వర వాదాన్ని ఖండించె విఠల!
86
అశ్వారూఢ బసవన్న పాలనకు సంకేతము
వచనకార బసవన్న సాహిత్య నిదర్శనము
ధర్మప్రవచన బసవన్న శివతత్వ చిహ్నము
ఈ బసవన్నే పరమ శివుని ప్రతి రూపము
కూడల సంగమ దేవుడే మహాశివుడు విఠల!
87
పాదములే దేవాలయపు స్తంభాలుగాను
శిరస్సే మెరిసే బంగారపు కలశముగాను
నా శ్వాసే పంచాక్షరీ మహా మంత్రంగాను
దేహమే పరమ పవిత్ర దేవాలయంగాను
భావించి నివసించమనె బసవడు విఠల!
88
మృణ్మయ శరీరమే చిన్మయముగాను
ఈ సజీవ కాయకమే కైలాసముగాను
కరచరణాదులే ఫలపుష్పములుగాను
సత్కర్మాచరణయే అభిషేకముగాను
బసవడు ప్రబోధించి ఆచరించెను విఠల!
89
దోచుకున్నవాని బుద్ధి నీచము దుర్మార్గము
దాచుకున్నవాడు దొంగతో సరి సమానము
మనిషి కలిగుండాలి ధర్మము దానగుణము
అందరు కలిసి నిర్మించాలి సమసమాజము
బసవడు ఆర్థిక సాంఘీక తేడాలొద్దనె విఠల!
90
గంగతో అభిషేకం చేద్దామంటే చేప ఎంగిలి
పూలతో పూజిద్దామంటే తుమ్మెద ఎంగిలి
పాలతో అభిషేకిద్దామంటే దూడతో ఎంగిలి
తేనెతో అర్చన చేద్దామంటే తేనెటీగ ఎంగిలి
బసవడు తన మనస్సర్పిస్తున్నాననె విఠల!


కామెంట్‌లు