పిచిక కథ;- డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

  ఒకూర్లో ఒక పిచిక వుండేది. అది ఒకరోజు ఊరిబైటున్న చేనులో గింజలు బెరబెరా తింటావుంటే... అనుకోకుండా దాని ముక్కుకి ఒక ముల్లు గుచ్చుకోనింది. మన మాదిరి దానికి చేతులుండవు గదా... దాంతో ఆ పిచిక ముల్లును పీక్కోలేక బాధతో విలవిలలాడతా ఒక మంగలాయన దగ్గరికి పోయి...
"మంగలాయనా.... మంగలాయనా... బెరబెరా తింటా వుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. కొంచం తీయవా" అనడిగింది. దానికా మంగలాయన “నీకు ముల్లు పీకడం తప్ప నాకింకేం పని లేదనుకుంటున్నావా... ఫోఫో... ఈన్నించి" అని కసురుకున్నాడు.
అపుడా పిచిక ఎగురుకుంటా... ఎగురుకుంటా.... ఆవూరి రాజు కాడికి పోయి “రాజా.. రాజా... బెరబెరా తింటావుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. మంగలాయనకాడికి పోయి తియ్యమంటే తియ్యలేదు. నువ్వా మంగలాయన్ని మక్కెలిరగ తన్ను" అనింది. దానికా రాజు "మా మంగలాయన్ని నేనెందుకు తంతాను. తన్నను ఫో" అన్నాడు.
అపుడా పిచిక ఎగురుకుంటా... ఎగురుకుంటా... అడవిలోని జింకలకాడికి పోయి “జింకలారా... జింకలారా... బెరబెరా తింటా వుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. మంగలాయనకాడికి పోయి తియ్యమంటే తియ్యలేదు. రాజుకాడికిపోయి ఆ మంగలాయన్ని మక్కెలిరగ తన్నమంటే తన్నలేదు. మీరు పోయి రాజు వేసిన పూలతోటలన్నీ పూర్తిగా నాశనం చేసేయండి" అనింది. అప్పుడా జింకలు "మారాజు వేసిన పూలతోటల్ని మేమెందుకు నాశనం చేస్తాం. చేయం ఫో" అన్నాయి.
అపుడా పిచిక ఎగురుకుంటా... ఎగురుకుంటా.. వేటగాని కాడికి పోయి "వేటగాడా... వేటగాడా... బెరబెరా తింటావుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. మంగలాయనకాడికి పోయి తియ్యమంటే తియ్యలేదు. రాజు కాడికి పోయి మంగలాయన్ని మక్కెలిరగ తన్నమంటే తన్నలేదు. జింకలకాడికి పోయి రాజు వేసిన పూలతోటలన్నీ నాశనం చేయమంటే చేయలేదు. నువ్వు పోయి ఆ జింకల్ని బాణంతో ఒక కొట్టు కొట్టూ" అనింది. అప్పుడా వేటగాడు “మా జింకల్ని నేనెందుకు బాణంతో కొడతాను. కొట్టను ఫో" అన్నాడు.
అపుడా పిచిక ఎగురుకుంటా... ఎగురుకుంటా ఎలుకకాడికి పోయి “ఎలకా... ఎలకా... బెరబెరా తింటావుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. మంగలాయనకాడికి పోయి తియ్యమంటే తియ్యలేదు. రాజు కాడికి పోయి మంగలాయన్ని మక్కెలిరగ తన్నమంటే తన్నలేదు. జింకలకాడికి పోయి రాజు వేసిన పూలతోటలన్నీ పూర్తిగా నాశనం చేయమంటే చేయలేదు. వేటగానికాడికి పోయి బాణంతో జింకల్ని ఒక్కదెబ్బ కొట్టమంటే కొట్టలేదు. నువ్వు పోయి ఆ వేటగాని వలలన్నీ కొరికి కొరికి పాడేయి" అనింది. అప్పుడా ఎలుక “మా వేటగాని వలల్ని నేనెందుకు నాశనం చేస్తాను. చేయను ఫో" అనింది.
అప్పుడు ఆ పిచిక ఎగురుకుంటా... ఎగురుకుంటా... పిల్లికాడికి పోయి "పిల్లీ.... పిల్లీ.... బెరబెరా తింటావుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. మంగలాయనకాడికి పోయి తియ్యమంటే తియ్యలేదు. రాజు కాడికి పోయి మంగలాయన్ని మక్కెలిరగ తన్నమంటే తన్నలేదు. జింకలకాడికి పోయి రాజు వేసిన పూలతోటలన్నీ పూర్తిగా నాశనం చేయమంటే
చేయలేదు. వేటగాని కాడికి పోయి బాణంతో 
జింకల్ని ఒక్కదెబ్బ కొట్టమంటే కొట్టలేదు. ఎలుకకాడికి పోయి వేటగాని వలల్ని నాశనం చేయమంటే చేయలేదు. నువ్వు పోయి ఆ ఎలుకను ఒక్క కొరుకు కొరుకు" అనింది. అప్పుడా పిల్లి "మా ఎలుకను నేనెందుకు కొరుకుతాను. కొరకను ఫో" అనింది.
అపుడా పిచిక ఎగురుకుంటా... ఎగురుకుంటా... అవ్వకాడికి పోయి "అవ్వా... అవ్వా... బెరబెరా తింటావుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. మంగలాయనకాడికి పోయి తియ్యమంటే తియ్యలేదు. రాజు దగ్గరికి పోయి మంగలాయన్ని మక్కెలిరగ తన్నమంటే తన్నలేదు. జింకలకాడికి పోయి రాజు వేసిన పూలతోటలన్నీ పూర్తిగా నాశనం చేయమంటే చేయలేదు. వేటగానికాడికి పోయి బాణంతో జింకల్ని ఒక్కదెబ్బ కొట్టమంటే కొట్టలేదు. ఎలుకకాడికి పోయి వేటగాని వలల్ని నాశనం చేయమంటే చేయలేదు. పిల్లికాడికి పోయి ఆ ఎలుకను ఒక్క కొరుకు కొరకమంటే కొరకలేదు. నువ్వు పోయి ఆ
పిల్లిని ఒక్క పెరుకు పెరుకు" అనింది. అప్పుడా అవ్వ “మా పిల్లిని నేనెందుకు పెరుకుతాను, పెరకను ఫో" అనింది..
అపుడా పిచిక ఎగురుకుంటా... ఎగురుకుంటా... ఆవుకాడికి పోయి “ఆవూ... అవూ.... బెరబెరా తింటావుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. మంగలాయనకాడికి పోయి తియ్యమంటే తియ్యలేదు. రాజు దగ్గరికి పోయి మంగలాయన్ని మక్కెలిరగ తన్నమంటే తన్నలేదు. జింకలకాడికి పోయి రాజు వేసిన పూలతోటలన్నీ పూర్తిగా నాశనం చేయమంటే చేయలేదు. వేటగానికాడికి పోయి బాణంతో జింకల్ని ఒక్కదెబ్బ కొట్టమంటే కొట్టలేదు. ఎలుకకాడికి పోయి వేటగాని వలల్ని నాశనం చేయమంటే చేయలేదు. పిల్లికాడికి పోయి ఎలుకను ఒక్క కొరుకు కొరకమంటే కొరకలేదు. ముసల్దానికాడికి పోయి పిల్లిని ఒక్క పెరుకు పెరకమంటే పెరకలేదు. నువ్వు నీ పాలు పిండడానికి వచ్చినపుడు ఆ ముసల్దాని మూతి మీద ఒక్క తన్ను తన్ను" అనింది. అప్పుడా ఆవు "మా ముసల్దాన్ని నేనెందుకు తంతాను. తన్నను ఫో" అనింది.
అపుడా వీచిక ఎగురుకుంటా... ఎగురుకుంటా... దూడ దగ్గరికి పోయి “దూడా... దూడా... బెరబెరా తింటావుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. మంగలాయనకాడికి పోయి తియ్యమంటే తియ్యలేదు. రాజు దగ్గరికి పోయి మంగలాయన్ని మక్కెలిరగ తన్నమంటే తన్నలేదు. జింకలకాడికి పోయి రాజుగారి పూలతోటలన్నీ పూర్తిగా నాశనం చేయమంటే చేయలేదు. వేటగానికాడికి పోయి బాణంతో జింకల్ని ఒక్కదెబ్బ కొట్టమంటే కొట్టలేదు. ఎలుకకాడికి పోయి వేటగాని వలల్ని నాశనం చేయమంటే చేయలేదు. పిల్లికాడికి పోయి ఆ ఎలుకను ఒక్క కొరుకు కొరకమంటే కొరకలేదు. ముసల్దానికాడికి పోయి పిల్లిని ఒక్క పెరుకు పెరకమంటే పెరకలేదు. ఆవుకాడికి పోయి పాలు పిండుతా వున్నప్పుడు ముసల్దాని మూతి మీద ఒక్క తన్ను తన్నమంటే తన్నలేదు. నువ్వు పోయి పాలు తాగుతా వున్నప్పుడు మీ అమ్మ పొదుగును ఒక్క కొరుకు కొరుకు" అనింది. అప్పుడా దూడ "మా అమ్మ పొదుగును నేనెందుకు కొరుకుతాను. కొరకను ఫో" అనింది.
అపుడా పిచిక ఎగురుకుంటా... ఎగురుకుంటా... ఒక కందిరీగకాడికి పోయి "కందిరీగా... కందిరీగా... బిరబిరా తింటావుంటే ముక్కులో ముల్లిరుక్కోనింది. మంగలాయనకాడికి పోయి తియ్యమంటే తియ్యలేదు. రాజు కాడికి పోయి మంగలాయన్ని మక్కెలిరగ తన్నమంటే తన్నలేదు. జింకలకాడికి పోయి రాజుగారి పూలతోటలన్నీ పూర్తిగా నాశనం చేయమంటే చేయలేదు. వేటగానికాడికి పోయి బాణంతో జింకల్ని ఒక్కదెబ్బ కొట్టమంటే కొట్టలేదు. ఎలుకకాడికి పోయి వేటగాని వలల్ని నాశనం చేయమంటే చేయలేదు. పిల్లికాడికి పోయి ఆ ఎలుకను ఒక్క కొరుకు కొరకమంటే కొరకలేదు. ముసల్దానికాడికి పోయి పిల్లిని ఒక్క పెరుకు పెరకమంటే పెరకలేదు. ఆవుకాడికి పోయి పాలు పిండుతా వున్నప్పుడు ముసల్దాని మూతి మీద ఒక్క తన్ను తన్నమంటే తన్నలేదు. దూడ కాడికి పోయి పాలు తాగుతా వున్నప్పుడు మీ అమ్మ పొదుగును ఒక్క కొరుకు కొరకమంటే కొరకలేదు. నువ్వు పోయి ఆ దూడను గట్టిగా ఒక్క కుట్టు కుట్టూ" అనింది..
అపుడా కందిరీగ... “అరెరే... ముక్కులో ముల్లిరుక్కోని అప్పన్నించీ నువ్వింత బాధపడతా వున్నా... ఒక్కరు గూడా పట్టించుకోడం లేదా, వుండు వీళ్ళ పని చెప్తా” అని ఎగురుకుంటా పోయి దూడ మూతి మీద వాలి గట్టిగా ఒక్క కుట్టు కుట్టింది.
అంతే... అది ఆ బాధకి విలవిలలాడతా వాళ్ళమ్మ పొదుగును కొరికేసింది. పొదుగు నొప్పి పెట్టి విలవిలలాడతా వుంటే పాలు పిండడానికి ముసల్ది వచ్చేసరికి దానికి కోపమొచ్చి ఆమె మూతి మీద ఒక్క తన్ను తన్నింది. మూతి పళ్ళు రాలిపోయి బాధతో విలవిలలాడతా వున్న అవ్వ పాల కోసం వచ్చిన
పిల్లిని చూసి కోపంతో ఒక్క పెరుకు పెరికింది. ఆ దెబ్బకి బాధతో విలవిలలాడతావున్న పిల్లి ఎలుక కనబడేసరికి దాన్ని ఒక్క కొరుకు కొరికింది. అంతే ఆ ఎలుక బాధతో విలవిలలాడతా పోయి వేటగాని వలలన్నీ సర్వనాశనం చేసేసింది. వలలన్నీ సర్వనాశనం కావడంతో కోపమొచ్చిన వేటగాడు బాణంతో జింకల్ని దబాదబా కొట్టినాడు. బాణాల దెబ్బకి విలవిలలాడిన జింకలు బాధతో పోయి రాజు వేసిన పూలతోటలన్నీ తొక్కి తొక్కి పెట్టినాయి. పూలతోటలన్నీ నాశనమయ్యేసరికి రాజుకు కోపమొచ్చి "ఏరా... పిచిక ముల్లు తీయమంటే తీయవా" అంటా మంగలాయన్ని ఒక్క తన్ను తన్నినాడు. అంతే.. ఆ దెబ్బకు వాడు వురుక్కుంటా వచ్చి పిచ్చిక ముక్కులో ముల్లు తీసేసినాడు.
***********
కామెంట్‌లు