శ్రావణ భాద్రపదాలు - డా.ఎం.హరికిషన్-కథలు-9441032212

  ఒకూర్లో ఒక బాపనాయన వుండేటోడు. ఆయనకు దేవుడంటే చానా భక్తి. ప్రతిరోజూ పూజ చేసి, ప్రసాదం పెట్టనిదే ఏమీ తినేటోడు కాదు. ప్రతి నెలా పూజలు, వ్రతాలూ వరుస తప్పకుండా చేసేటోడు. ఆయనకో పెండ్లాం వుంది. ఆమె పెద్ద అమాయకురాలు. అచ్చరం ముక్క గూడా చదువుకోలేదు. ఇల్లుదాటి బైటికి రాదు. మొగుడు ఏది చెప్తే అది మట్టసంగా నోరు మూసుకోని చేయడం తప్ప ఆమెకు ఏమీ తెలీదు.
ఒకరోజు వానికి కాశీకి పోయి రావాలనిపించింది. కాశీ అంటే చానాచానా దూరంగదా. పోయి రావడానికి ఎంత కాదన్నా రెండు మూడు నెలల పైన్నే పడతాది. ఇప్పుడంటే యాడికయినా పోవాలన్నా బస్సులు, రైళ్ళూ, విమానాలూ వున్నాయి. రయ్యిమని పోయి రయ్యిమని రావచ్చు. కానీ పూర్వకాలమట్లా కాదు. ఎంత దూరమయినా సరే నడుస్తానే పోవాల. నదుస్తానే రావాల.
అన్ని రోజులు పోతే ఇంట్లో పూజా పునస్కారాలు ఎట్లా... అదీగాక వచ్చేది శ్రావణ భాద్రపద మాసాలు. పూజలూ ప్రతాలూ బాగా చేయాల. అందుకని పెండ్లాన్ని పిలిచి “ఏమే...  నేను కాశీకి పోయొస్తా. నువ్వు ఇంట్లో పూజా పునస్కారాలకు ఏమాత్రం లోటు రానియ్యొద్దు. అదీగాక నేను పోగానే శ్రావణ భాద్రపదాలు వస్తాయి. కాస్త జాగ్రత్తగా చూసుకో... అన్నీ పద్ధతి ప్రకారం చేసి పెట్టు" అన్నాడు. అప్పుడే ఇద్దరు దొంగలు దొంగతనం చేద్దామని వాళ్ళింటికి వచ్చినారు. కిటికీలోంచి ఆయన మాటలు విని “ఇప్పుడెందుకులే పోవడం... వీడు కాశీకి పోయినాక వద్దాం" అనుకున్నారు.
ఆ బాపనాయన పోయే ముందు ఇంట్లో వున్న బంగారమంతా మూటగట్టి ఇంటి వెనకున్న మల్లె చెట్టు కింద ఒక గుంత తవ్వి... దాంట్లో దాచి పెట్టి వెళ్ళిపోయినాడు. వాడట్లా పోవడమాలస్యం ఆ దొంగలిద్దరూ మట్టసంగా మంచి బట్టలేసుకోని వాళ్ళింటి కొచ్చినారు. ఆమె వాళ్ళని చూసి “ఎవరు నాయనా మీరు... ఏం కావాల" అనడిగింది. ఆమె పెద్ద అమాయకురాలని వాళ్ళకు ముందే తెలుసు. దాంతో “అదేంటమ్మా... అట్లా అడుగుతావ్. మమ్మల్ని గుర్తుపట్టలేదా... నేను శ్రావణుడు... వీడు భాద్రపదుడు. మేమొస్తున్నట్లు నీ మొగునితో ముందే చెప్పినామే... నీకు చెప్పలేదా" అన్నాడు.
ఆమె అచ్చరం ముక్కగూడా చదువుకోలేదు గదా... దాంతో శ్రావణ భాద్రపదాలంటే తెలుగు నెలల పేర్లని ఆమెకి తెలీదు. అందుకని వాళ్ళ మాటలు నమ్మి "రండి... రండి... నిన్ననే నా మొగుడు పోతా పోతా మీరొస్తున్నారని చెప్పి పోయినాడు" అని లోపలికి పిల్చుకోని పోయింది.
"మొగుడు శ్రావణ భాద్రపదాల్లో ఏ లోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకో" అన్నాడు గదా... దాంతో రోజుకో వంట చేసి చాలుచాలన్నా వినకుండా ఇంకొంచం... ఇంకొంచం... అంటూ కొసరికొసరి వడ్డించేది. వాళ్ళు హాయిగా ఆమె పెట్టినేటివన్నీ తినుకుంటా... లోపల్లోపల నవ్వుకుంటా... రెండునెలలు అక్కన్నే కాలు మీద కాలేసుకోని దర్జాగా గడిపినారు.
కాశీకి పోయిన బాపనాయన తిరిగొచ్చే సమయం దగ్గరపడింది. వస్తే వాళ్ళ మోసం బయటపడిపోతుంది గదా... అందుకని ఆ దొంగలిద్దరూ ఇంట్లో వున్నవన్నీ ఎత్తుకోని ముందే పారిపోదామని ఆమె పన్నుకున్నాక రాత్రిపూట సప్పుడు గాకుండా ఇండ్లంతా తెగ వెదికినారు. ఎంత వెదికినా వాళ్ళకు బంగారు వస్తువులు ఒక్కటి గూడా యాడా కనబల్లేదు. ఇట్లా లాభం లేదనుకోని వాళ్ళు ఒక ఉపాయమాలోచించి ఒకరోజు పొద్దున్నే “అమా... అమా... మాకు కాస్త పనుంది. ఈ రోజు పోయి మళ్ళా వచ్చేవారం వస్తాం... రాత్రిపూట కొంచం జాగ్రత్త... చుట్టుపక్కల దొంగతనాలు ఎక్కువయిపోయినాయి. బంగారమంతా తీసి యాడన్నా జాగ్రత్తగా దాచిపెట్టు" అని చెప్పినారు.
దానికామె “మీరేం భయపడమాకండి... నా మొగుడు అంత తెలివితక్కువోడు కాదు. పోయేముందు దొంగలెవరికీ దొరకగూడదని... అదిగో... ఆ మల్లె చెట్టుంది చూడు... దాని కింద గుంత తవ్వి అన్నీ దాంట్లో భద్రంగా దాచిపెట్టి పోయినాడు" అని చెప్పింది. వాళ్ళు ఆమె తెలివితక్కువతనానికి లోపల్లోపల నవ్వుకోని సరే అని వెళ్ళిపోయినారు.
ఆ దొంగలిద్దరూ అట్లా పోయినట్లే పోయి... చీకటి పడగానే మట్టసంగా వెనక్కి తిరిగొచ్చి సప్పుడు గాకుండా మల్లె చెట్టు కిందున్న బంగారాన్నంతా తీసుకోని... అట్లాగే ఇంట్లో వున్న విలువయిన వస్తువులన్నీ ఎత్తుకోని పారిపోయినారు.
వాళ్ళట్లా పోయిన వారానికల్లా ఆ బాపనాయన కాశీ నుండి తిరిగి వచ్చినాడు. స్నానం చేసి పెండ్లాం పెట్టిన తినుబండారాలన్నీ తింటా... తింటా... “ఏమే... శ్రావణ భాద్రపదాలు వచ్చినాయి గదా... ఏమేమి చేసినావు" అనడిగినాడు.
దానికామె సంబరంగా "నీవు చెప్పినాక చేయకుండా వుంటానా... బ్రమ్మాండంగా చేసినా... కావాలంటే వాళ్ళు రేపో... ఎల్లుండో వస్తారు. వాళ్ళనే అడుగు" అనింది.
వానికామాటలు అర్ధంగాక “వాళ్ళెవరే" అన్నాడు. దానికామె “అదేనండీ... శ్రావణ భాద్రపదులు... మీరట్లా పోవడమాలస్యం వాళ్ళిట్లా వచ్చినారు. నీవు ముందే చెప్పి పోయినావు గదా... అందుకే ఏలోటూ రాకుండా చేసిన వంట మళ్ళా చేయకుండా రోజుకోరకం వంట చేసి పెట్టా. ఈ రెండునెల్లూ బ్రహ్మండంగా చూసుకున్నా... పోయిన వారమే ఏదో అత్యవసరమైన పనుందని, మళ్ళా వస్తామని చెప్పి పోయినారు. ఈరోజో... రేపో... వస్తారు. రాగానే అడుగు... నేనెంత బాగా చూసుకున్నానో వాళ్ళే చెబుతారు" అనింది.
ఆ మాటలకు వాడు అదిరిపడి “ఓసినీ తెలివితక్కువదానా... శ్రావణ భాద్రపదాలంటే తెలుగు నెలల పేర్లే... మనుషులు కాదు" అని అనుమానమొచ్చి ఉరుక్కుంటా పోయి చూస్తే ఇంగేముంది... ఇంట్లో విలువయిన వస్తువులూ లేవు... మల్లె చెట్టు కింద బంగారమూ లేదు...
*********
కామెంట్‌లు