సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -413
అజ్ఝల్ న్యాయము
*****
అజ్ఝల్ అనగా, అచ్చు ,కవచము, మండుచున్న నిప్పు,పలక, చర్మము,వేదభాగములు,అరణ్యకము,పనస .. ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
ఇక్కడ అజ్ఝల్ ను అచ్చుగా తీసుకోవడమైనది.
అచ్చులు ప్రాణములు;హల్లులు ప్రాణులు.అచ్చుతో సంయోగము ఉన్నంత వరకు హల్లులకు స్ఫుటమైన ఉచ్ఛారణ వుంటుంది.అచ్చు లేనిచో, హల్లుకు ఉచ్ఛారణే వుండదు.
అచ్చు అనే ప్రాణం వున్నంత వరకే ఈ దేహమనే హల్లు తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ప్రాణం లేకపోతే ఈ దేహం  నిర్జీవము అనే అర్థంతో ఈ"అజ్ఝల్ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దేహాన్ని నడిపించే శక్తినే ప్రాణము అంటారు. మరి మనలో ప్రాణము ఉన్నట్టు ఎలా తెలుస్తుంది?మొట్ట మొదట వైద్యులు చూసేది గుండె కొట్టుకోవడాన్నే.గుండె పనిచేస్తుంది అంటే మనలో ప్రాణం వున్నట్టే. మరి ప్రాణం అనే శక్తి అదొక్క పనే చేయిస్తుందా? కాదు కదా!
ప్రాణశక్తి దేహక్రియలకు అన్నింటికీ బాధ్యత వహిస్తుంది .పంచేంద్రియాలను నడుపుతుంది. ఆకలి దప్పులను కలిగిస్తుంది.ఈ ప్రాణ శక్తి ప్రాణం చలన రూపంలో ప్రవహిస్తుంది. ఈ ప్రాణశక్తి ప్రవాహం ఆగిపోతే శరీరం చచ్చిపోతుంది.
ఈ ప్రాణశక్తి ఐదు రకాలుగా పనిచేస్తుందని యోగ శాస్త్రంలో చెప్పబడింది.
అవి 1.ప్రాణం, 2.ఆపానం, 3.సమానం,4.ఉదానం,5.వ్యానం.
ప్రాణం అనేది మొదటిది. ఇందులో శ్వాస, ఆహారము, బలము,శబ్దోశ్చారణలోని స్ఫష్టత.. వీటన్నింటినీ గ్రహించే శక్తిని ప్రాణము అంటారు.ఇది అనాహత చక్రాన్ని ప్రభావితం చేస్తూ వుంటుంది.
రెండవది అపానము: ఇది విసర్జక క్రియలను నిర్వహిస్తుంది.ఇది మూలాధార చక్రమును ప్రభావితం చేస్తుంది.
3. సమానము:-ఇది శరీరములోని రసాలను యథా స్థానాలకు తీసుకుని వెళ్లి పంపిణీ చేస్తుంది.ఇలా చేసే ప్రాణశక్తిని సమానము అంటారు.ఇది మణి పూరక చక్రబంధంగా వుంటుంది.
4.ఉదానము:-శరీరాన్ని నిటారుగా నిలబెట్టి పడిపోకుండా చేసే శక్తిని ఉదానము అంటారు. నిద్రావస్థ, మరణానంతర విశ్రాంతి స్థితిలో ఇది కనిపిస్తుంది.ఇది విశుద్ధ చక్రమునకు అనుసంధానం చేయబడి ఉంటుంది.
5.వ్యానము:- వ్యానము అనగా వ్యాపించి ఉండటం.రక్త సంచారము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు,నాడుల ద్వారా ఇది శరీరం మొత్తాన్ని నియంత్రిస్తుంది. మనసు, శారీరక విధులు కూడా ఈ శక్తి ద్వారానే జరుగుతాయి. ఇది స్వాధిష్ఠాన చక్రమునకు సంబంధించినది.
హల్లులనే ప్రాణులను పదాలుగా, వాక్యాలుగా , మాటగా,రాతగా వాటి క్రియలను నిర్వహించడానికి ప్రాణములైన అచ్చులే కారణము.హల్లులు దేహమైతే అచ్చులు ప్రాణశక్తులు.
 ఇలా అచ్చులు,హల్లులను  మన పెద్దలు  యోగశాస్త్రములోని ప్రాణికి, ప్రాణశక్తులకు వర్తింపజేసి  చెప్పారు.
 మరి ఈ న్యాయాన్ని   మన పెద్దవాళ్ళు ఎందుకు సృష్టించి చెప్పారో చూద్దాం.  మన ఉనికి  ప్రాణి ఐతే మన వ్యక్తిత్వం ప్రాణమని చెప్పుకోవచ్చు. ప్రాణులుగా అందరూ బతుకుతారు.కానీ వ్యక్తిత్వమే ప్రాణంగా బతికే వాళ్ళు కొందరు.
 అలా ఉన్నతమైన వ్యక్తిత్వమే ప్రాణంగా ఈ సమాజంలో మన ఉనికిని చాటుకుందాం. "అజ్ఝల్ న్యాయము"నకు న్యాయము చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు