సుప్రభాత కవిత ; - బృంద
నిశిలో నిదురించిన
జగతికి మేలుకొలుపై
తూరుపు తేరుకుని
కొండెక్కి పిలిచింది

అలుక తెలిసిన ఆప్తుడు
అందంగా నవ్వుతూ
ఇదుగో వచ్చేస్తున్నానంటూ
చకచకా వచ్చేసాడు

వస్తూ వస్తూ వేలవేల
వెలుగులు కురిపిస్తూ
చీకటికి సెలవిస్తూ మాపటిదాకా మాటాడొద్దని తరిమేసాడు

ఆకులన్నీ అదిచూసి
గలగలమంటూ సవ్వడిగా
పకపకా నవ్వుతూ
చేతులూపి స్వాగతం చెప్పాయి

నింగిని పయనించే నీలి మేఘాల
జలతారంచు మేలిముసుగుతో
ముస్తాబై మురిపెంగా తమ అందం చూడమంటూ వెంట  పడ్డాయి

ఆగి చూసే సమయం లేదూ
వేగమే వెళ్ళాలంటూ
మొగమైనా చూడకుండా
చకచకా సాగిపోతున్నాడు

రోజూ జరిగే సరాగాలే
అయినా అందమే!
నిత్యం వచ్చే వేకువే
అయినా ప్రత్యేకమే!

రేపన్న మాట తోటే
ఊపందుకునే జీవితం
ఆశలన్నీ నింపుకుని తూరుపు 
వైపు చూసే అంతరంగం

ఉహల ఉయ్యాలను
ఊరిస్తూ ఊపే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు