పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం సాధ్యం



 పుస్తక పఠనం అభిరుచి కలిగియుంటే విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసం సాధించగలరని 
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, సాంఘిక శాస్త్రోపాధ్యాయులు, రాజాం రచయితల వేదిక సభ్యులు, ప్రముఖ గాయకులు, చిత్రకారులు కుదమ తిరుమలరావు అన్నారు.
ఇల్లే ఒక గ్రంథాలయంగా తీర్చిదిద్దుకోవాలని, సాహిత్యాన్ని చదివి దేశ ఔన్నత్యాన్ని అవగాహన చేసుకోవాలని అన్నారు. తద్వారా సామాజిక చైతన్యాన్ని, జీవిత నైపుణ్యాన్ని సముపార్జించుకోవచ్చునని తిరుమలరావు పిలుపునిచ్చారు. 
రాజాం జి.ఎం.ఆర్. జి.సి.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాలలో విద్యార్ధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 
విద్యార్థి వ్యక్తిత్వ వికాస సదస్సుకు తిరుమలరావు ప్రత్యేక వక్తగా హాజరై ఉపన్యసించారు. 
పుడమితల్లికి పుల్వామా గాయం, 
మేలుకోవోయ్ యువత, ఆత్మహత్యతో సాధిస్తివేందిరా, 
ఓటు వేయకుంటే నీవు ఓడిపోయినట్టురా, అయోధ్యరామా, అమ్మ, స్నేహం, పల్లె, నింగి నేల, భూమాత వంటి స్వీయగీతాలను ఆలపించి అందరిలో సామాజిక స్పృహను పెంపొందించారు. మానవత్వంతో మెలిగే జీవితమే అర్ధవంతమైన జీవితమని, వ్యసనాలకు దూరంగా ఉండాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలు చారిత్రక అంశాలను ఉటంకిస్తూ ఆయన ఉపదేశించారు. 
అతిథి ప్రసంగీకునిగా విచ్చేసి విద్యార్ధుల మనోవికాసానికి దోహదపడే అంశాలను ఉపన్యసించిన తిరుమలరావును డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.పురుషోత్తమ రావు అభినందించారు. 
అనంతరం తిరుమలరావును డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం.పురుషోత్తమ రావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్.రవీంద్ర కుమార్, తెలుగు ఉపన్యాసకులు తురంగి విశ్వనాథం, తెలుగు విభాగాధిపతి ఇనుపకుర్తి అప్పన్న, స్టేటస్టిక్స్ లెక్చరర్ రెడ్డి విశ్వేశ్వరరావు, ఫిజిక్స్ లెక్చరర్ ఎ.లక్ష్మణరావు, కళాశాల పరిపాలనాధికారి డా.జి.రాంబాబులతో పాటు బి.ఎస్సీ.హానర్స్ విద్యార్థులు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, కానుకలతో ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు