అందం;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నీ ముఖంలోని మెరుపును
చంద్రుడు తనదిగా చేసుకున్నాడు
నీ పెదవిమీది చిరునవ్వును
విరబూస్తున్న పువ్వులు దొంగిలించాయి
అలల్లా పరుచుకున్న నీ ముంగురులు చూసి
తన నేస్తాలేమోనని ఆ నీలిమేఘాలు భ్రమపడి
నింగినుండి కిందికి దిగివచ్చాయి
నీ అడుగుల హొయలు చూసి
లేళ్ళు తమ అడుగులను 
సింగారించుకున్నాయి
నీ కళ్ళ కాటుక రంగుతో
ఆ నిశి కూడా తననుతాను సరిదిద్దుకున్నది
నీనుండే నెమళ్ళు నాట్యాన్ని నేర్చుకున్నాయి
అందుకే అవి తలవంచి నమస్కరిస్తున్నాయి
సర్వాంగ సుందరమైన నిన్నుచూసి
వసంతమే సిగ్గుతో తలవంచింది
నీ శరీరము వెదజల్లుతున్న ప్రకాశాన్ని
సూర్యుడు తన కిరణాలుగా మార్చుకున్నాడు
భగవంతుడు చేసిన విచిత్రమిది
ముందుగా నిన్ను ఇలా సృష్టించి
నిన్ను చూసి ఈ అందమైన
ప్రపంచాన్ని సృష్టించాడు!!
***********************************


కామెంట్‌లు