పబ్లిక్కంటే పబ్లిక్కే ... ... డా.ఎం.హరికిషన్-కర్నూలు-94410 32212
 ఎమ్మే పరీచ్చలంత ఈజీకాదు గదా పదో తరగతి పరీచ్చలంటే. ఇదేందిరా నాయనా ఇట్లా మాట్లాడ్తా వున్నాడనుకుంటా వున్నారా... ఆ శ్రీకృష్ణదేవరాయల సాచ్చిగా చెబ్తున్నా. ఈ మధ్యన డిస్టెన్సు ఎడ్యుకేషన్లొచ్చినాక పరీచ్చలు రాసేటోళ్ళ మధ్యన డిస్టెన్సు బాగా తగ్గిపోయింది. మందున్నోళ్ళనో, ఎనకున్నోళ్ళనో చూపియ్యమని అడుక్కోవాల్సిన అవసరం గూడా లేదు. డబ్బులుంటే గైడ్లు ముందు బెట్టుకోని పరపరపర రాసిపారేయడమే. అదీ చాతకాకపోతే హెల్పర్లను గూడా పెట్టుకోవచ్చు. యూనివర్శిటీలకు డబ్బులు కావాల. మనకు పాసు కావడం కావాల. అంతే... డిస్టెన్సు ఎడ్యుకేషన్లు ఈ మద్యొోచ్చినాయి గానీ యూనివర్శిటీల్లో ఈ పద్ధతి కొత్తేంగాదు. అక్కడసలు ఫెయిలనేదే లేదు. ఎక్కువడిస్తే థర్డ్‌క్లాసు కూడా రాదు. అందిరికీ యాభై పైన్నే. గాడిదకైనా సరే రాయడమొస్తే చాలు మాంచి పర్సెంటేజీతో పాసయిపోవచ్చు. ఎవడయినా కోర్టులో కేసేసి ఈ పరీచ్చ పేపర్లన్నీ తీపిచ్చి అందరి ముందూ పెట్టి మళ్ళా దిద్దిస్తే సగానికి సగం మంది నున్నగా నూక్కపోతారు. రాసేటోళ్ళది తప్పా... దిద్దేటోళ్ళది తప్పా అంటే గుడ్డు ముందా... కోడి ముందా... అని చర్చించినట్లుంటాది. వడ్డించేటోడు మనోడైతే యాడ కూచున్నా పరవాలేదన్నట్లు మేము ఎమ్మే చదివేటప్పుడు మా పేపర్లు దిద్దుతా వుండేది మా సార్లే. పొరపాట్న ఎవరైనా నిజాయితీగా కాయా పండా అని దిద్దినాడనుకో ఫెయిలయినోడు వూకుంటాడా... కచ్చ కట్టుకోని యూనియన్లనెంటేసుకోని వుతికి ఆరేస్తాడు. అసలు కొన్ని యూనియన్లుండేది ఇట్లాంటి యదవ పనులు చేయడానికే గదా... న్యాయం ధర్మం చూడకుండా మనోల్లని మనం వెనుకేసుకు రావాలనేదే దాండ్ల సిద్ధాంతంగా మారిపోయింది. అందుకే మార్కులు మురిక్కాల్వ లెక్క పొంగి పొర్లుతుంటాయి. పరీచ్చలో ఏదడిగినా ఆవు వ్యాసంలెక్క రాసి పార్నూకడమే. పేపర్లు నింపితే చాలు మిగతాది దిద్దేటోడు చూసుకుంటాడు. కాబట్టి పాసయినోళ్ళలో ఏది గుర్రం, ఏది గాడిద అని ఎట్లా గుర్తుపట్టాలంటే ఎమ్మేలో నూటికి యాభైకంటే తక్కువొస్తే పరమ పనికిమాలినోడనీ, అరవై కంటే తక్కువొస్తే చెత్తనీ, అరవై కంటే ఎక్కువొస్తే పరవాలేదనీ, అరవై ఐదు డెబ్బై పైనొస్తే శభాషనీ అర్థం జేసుకోవాల.
ఇంతకూ మనం మాట్లాడుకుంటా వున్నది పదోతరగతి పరీచ్చల గురించి కదా... తొమ్మిదో తరగతి వరకూ హాయిగా ఆడుతా పాడుతా తిరుగుతా వుండే మాకు పదో తరగతిలోకి రాగానే సార్లు పబ్లిక్కు పబ్లిక్కు అంటా మాటిమాటికి భయపడిస్తా, బెత్తం తీసి వూకూకెనే ప్యాంట్లు తడిసిపోయేటట్టు సావనూకేటోళ్ళు. లేస్తే పరీచ్చ కూచుంటే పరీచ్చ పెడ్తా సావుబతుకుల సమస్యగా మార్చి పారేసినారు. పరీచ్చలు దగ్గరపడ్తున్నకొద్దీ ఆ భయం పెరిగీ పెరిగీ బద్దలయ్యే అగ్నిపర్వతం లెక్క కుతకుతలాడతా వుండేటోళ్ళం. దానికి తోడు మాకు పరీచ్చ సెంటర్‌ గడియారం ఆసుపత్రి దగ్గరి వుమ్మరరబిక్‌ స్కూళ్ళో ఏసినారు. దాని చుట్టూ ఎత్తయిన గోడలుండి జైలులెక్కుండేది. బైటి నుంచి చచ్చినా ఎవడూ లోపలికి రాలేడు. వస్తే పోలేడు. పదో తరగతిలో నేనూ, జనార్దన్‌, రాబర్ట్‌, చలపతి ఒక జట్టు. కానీ చలపతి గాడు మా స్కూలు కాదు. మున్సిపలైస్కూల్‌. వాని కత ఆఖరులో చెబ్తా. 
అప్పట్లో జంబ్లింగ్ సిస్టం లేదు కాబట్టి పరీచ్చల్లో పేర్లలో మొదటి అచ్చరాన్ని బట్టే నంబర్లొస్తాయి గదా... అట్లా నేను, నా వెనుక జనార్దన్‌ గాడూ పన్నాం. రాబర్ట్‌గాని నంబర్‌ కాస్త దూరం. కానీ పరీచ్చ హాల్లో ఒకరివెనుక ఒకరివి నెంబర్లేస్తా వస్తావుంటే వాడు అనుకోకుండా నా పక్కకొచ్చేసినాడు. మా ముగ్గురిలో నేనే క్లవర్ని. జనార్దన్‌గాడు డల్లు. రాబర్టు గాడు నిల్లు. రేయ్‌ నిన్నే నమ్ముకున్నాం ఎట్లా ఇగ్గుకొస్తావో ఏమో'' అనేటోళ్ళిద్దరూ. పరీచ్చల రోజు వణుక్కుంటా వణుక్కుంటా నేనూ రాబర్టుగాడు టెన్షన్‌ టెన్షన్‌గా పోయినాం. అప్పటికే సెంటర్‌ చుట్టూ పోలీసోల్లు పహారా కాస్తున్నారు. రాబర్ట్‌గాడు ఎత్తయిన గోడల్ని, పోలీసుల్ని చూస్తా ''రేయ్‌... ఈడ కాపీలు గూడా ఏమీ జరిగేటట్లు లేవు. అదీగాక చెకింగ్‌ స్క్వాడ్లుంటారంటా. వాళ్ళు రయ్యిన కార్లేసుకోని కర్నూలంతా తిరుగుతా... దొరికినోన్ని దొరికినట్టు అక్కడికక్కడే డీబారు చేసి బైటకు దొబ్బుతా వుంటారంటా. తలతిప్పితే గూడా వూకోరంట. మరెట్లరా నేను పాసయ్యేది'' అన్నాడు గాల్లోకి చూస్తా విచారంగా. అంతలో జనార్దన్‌గాడు వాళ్ళ నాయనతో పాటు సైకిల్మీద కూచోని చిరునవ్వులు నవ్వుతా ఒచ్చేసినాడు. జనార్దన్‌ గాని నాయన పోలీసు. వీనికి పరీచ్చలని ఏకంగా పదైదు రోజులు సెలవు పెట్టేసినాడంట. ఐనా డ్రస్సు మాత్రం పోలీసుదే. ముగ్గురినీ దగ్గర కూచోబెట్టుకోని ''రేయ్‌... మీరేం భయపడమాకండి. ఈడున్న పోలీసులంతా మనోల్లే. నేను లోపల్నే తిరుగుతా వుంటా. అర్దగంటకొకడు ఒంటికని చెప్పి బయటికొస్తా వుండండి. కాపీలు తీసుకొని పోతా వుండండి. సార్ల సంగతి నే చూసుకుంటాలే'' అన్నాడు భుజాలు తడతా... ఇదొకటయితే త్రివిక్రమ్‌ అని మా క్లాసులో ఒకడుండేటోడు. వాళ్ళ నాయన చానా పెద్ద అఫీసరు. దాంతో వానికోసం ఒక బ్యాచ్‌ అధికార్లు రంగంలోనికి దిగినారు. వాన్ది మా పక్కరూమే. మొదటి రెండ్రోజులు కాస్త స్ట్రిక్టు స్ట్రిక్టుగా కాస్త లూజు లూజుగా ఒక మాదిరిగా పరీచ్చలు రాసినాం భయం భయంగా. మూడో రోజు ఒక సారొచ్చినాడు. వచ్చీరాగానే ''రేయ్‌... ఎవరి దగ్గరన్నా కాపీ చీటీలుంటే మట్టసంగా ఇచ్చేయండి. నేనసలే మంచోన్ని గాదు. దొరుకుతే గూబ గుయ్యిమంటాదొకొక్క నాకొడుకుకి'' అని ఎచ్చరించినాడు. దాంతో అందరూ భయపడి ఎక్కడెక్కడ దోపుకున్నవన్నీ బెరబెరబెర పీకిచ్చేసినారు. ఆయన అన్నీ తీస్కపోయి బైట పారనూకినాడు.
పరీచ్చ జరుగుతా వుంటే ఆయన రెండు చేతులూ వెనుక కట్టుకోని యమధర్మరాజు లెక్క అట్లా యిట్లా తిరుగుతావుంటే వంచిన తలెత్తకుండా అందరమూ రాసేస్తా వున్నాం. పక్కరూంలోనే గదా త్రివిక్రముగాడుండేది. సారికి బయటికొచ్చి కట్టలు కట్టలు తీసుకోని పోతా వున్నాడు. మాకూ, మా సారుకి కనబడతానే వుంది. అంతలో మా సారుకి ఏమయిందో ఏమో వెంటనే ''రేయ్‌... గొప్ప గొప్పోళ్ళ బిడ్డలంతా పేపర్ల మీద పేపర్లు పెట్టి చూసి రాసేస్తా వుంటే మీరేం పాపం చేసినారురా... రాసుకోండి... నే చూసుకుంటా'' అని కుర్చీ ఎత్తకపోయి వాకిలికాడేసుకోని ఎవడన్నా వస్తాడేమోనని బైటకి చూడ్డం మొదలుపెట్టినాడు. అంతలో ఒకడు లేచి ''కాపీలాడున్నాయి సార్‌... మీరు తంతామంటే అన్నీ ఇచ్చేసినాం గదా ముందే'' అంటే ''ఓరినీ సారన్నాక... ఆ మాటనకుండా ఎట్లుంటాడ్రా... అడుగుతే సత్తె అరిచ్చంద్రుని లెక్క ఇచ్చేయడమేనా... సరే ఏం చేద్దాం. మీ ఖర్మ. పక్కనున్నోని దాంట్లో చూసి రాస్కోండి'' అన్నాడు నవ్వుతా. ఇంగ చూడు రాబర్ట్‌గాడు నాకతక్కపోయినాడు. అట్లా మూడో రోజుకల్లా అందరికీ పబ్లిక్కంటే భయం పోయి నవ్వులాటయి పోయింది. ఒకొక్కడు కట్టలు కట్టలు కాపీలు తెచ్చుకోడం రాసేయడం అంతే. ఆఖరికి ఎంత అవలా అయిపోయిందంటే అట్టకింద దాచి పెట్టుకోని దాచిపెట్టుకోని రాసేది పోయి కొందరు ఏకంగా పైన్నే పెట్టుకోని రాయడం మొదలెట్టినారు. ఒకసారు అది చూసి ''ఒరేయ్ పనికిమాలిన యదవళ్ళారా... మాంసం తింటా వున్నామని చెప్పి ఎముకలు మెళ్ళో వేసుకోని తిరుగుతార్రా... ఎవరైనా'' అంటా ఫెడీల్మని నవ్వుతానే ఒక తన్ను తన్నినాడు ఒకన్ని. జనార్దన్‌ గాని నాయన సెలవు పెట్టింది మాకు కాపీలేయడానికే గదా... దాంతో పరీచ్చ మొదలుపెట్టిన కాన్నించి ఐపోయేదాకా రూముకాన్నే గైడ్లు సంకన బెట్టుకోని మాకన్నా టెన్షన్‌ టెన్షన్‌గా తిరుగుతా వుండేటోడు. అర్ధగంటకొకసారి జనార్దన్‌గాడో... రాబర్ట్‌గాడో... బైటకు పోవడం... తీసుకరావడం... రాసుకోవడం... వాళ్ళ నాయన మాటిమాటీకీ కిటికీ కాడికొచ్చి ''రేయ్‌... అన్నీ రాసినావా... ఇంగా కావాల్నా'' అంటూ అన్నీ రాసేసినా వదలకుండా ఆఖరికి ఛాయిస్‌ గూడా రాపిచ్చేటోడు. హిందీ పరీచ్చ. ఇంగ్లీషు పరీచ్చలకైతే తమాష తమాష కాదు. చానామందికి చదవడం గూడా రాదు. కాపీలకింద పేజ్‌ టర్న్‌ ఓవర్‌ అనే దాన్ని గూడా వదలకుండా ఎత్తేసేటోళ్ళు. నాముందు తిరుపాల్‌గాడనీ ఒడుండేటోడు. వాడు హిందీ పరీచ్చ రోజు కాపీల కట్ట చేతిలో పట్టుకోని దాండ్లను కిందికీ మీదికీ చూస్తా పెన్నుకు మూతబెట్టేసి గొణుక్కుంటా వుంటే ''రేయ్‌... ఏందిరా అట్లా గమ్మున కూకోనున్నావ్‌'' అనడిగినా. దానికి వాడు కండ్లనీళ్ళు బెట్టుకోని ''రేయ్‌... హరీ... పరీచ్చలయిపోయినాక నీకు నన్నారి తాపిస్తా గానీ... కాస్త దీండ్లలో ఏవొచ్చినాయో... ఏవి రాలేదో చూసి నెంబర్లేసియ్యిరా... పుణ్యముంటాది'' అన్నాడు దీనంగా... సరే పాపమని ఏసిచ్చినా. ఇంగ్లీషు పరీచ్చ రోజయితే తిరుపతిలో మీ అన్న పెండ్లి జరుగుతా వుంది... రమ్మని మీ స్నేహితునికి లేఖ రాయమని వస్తే జనార్దన్‌గాని నాయనకు అదర్థంగాక సారుకి సెలవు చీటీ పంపిచ్చినాడు. వాడు దాన్నే పరపరపర గీక్తా వుంటే ''రేయ్‌... అది కాదురా వచ్చినేది'' అని చెప్తే వాడు చిరునవ్వు నవ్వి ''ఏదో ఒకటిలేరా... గుడ్డి కన్నా మెల్ల మేలుకదా... కనీసం ఒక రెండన్నా ఏయరా జాలిపడి'' అన్నాడు. చానామంది దాన్నే వద్దు వద్దన్నా వినకుండా అచ్చుగుద్దేసినారు. నేను చానా వరకు సొంతంగానే రాసినాను గానీ మధ్య మధ్యలో ఏదైనా అనుమానమొస్తే ఎందుకనవసరంగా రిస్కు తీసుకోవడమని, వాటిని మాత్రం కాపీ చీటీ పెట్టి దించేసేటోన్ని. అట్లా ఆడతా పాడతా ఒకొక్క పరీచ్చే రాస్తా వుంటే... ఇంకో మూడు పరీచ్చలున్నాయనగా వచ్చింది బాంబులాంటి వార్త. ''పరీచ్చ పేపర్లు లీకయి ఆరోజు పేపరు పేపర్లో వచ్చిందనీ, దానికి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు రాజీనామా చేసినాడనీ, పరీచ్చలు పోస్టుపోనయినాయనీ, మల్లా ఎప్పుడు జరుగుతాయో పేపర్లో ప్రకటిస్తారనీ'' దాని సారాంశం. మాకేం చేయాల్నో అర్థంగాక దిక్కులు చూస్తావుంటే మా జనార్ధన్‌గాని నాయన కండ్లనీళ్ళు బెట్టుకోని ''రేయ్‌... ఎంతమంది కాళ్ళు పట్టుకోని... ఎన్నిసార్లు వేడుకుంటే దొరికిందనుకున్నారురా ఈ పదైదు రోజుల సెలవు. మర్లా ఆ నా కొడుకులు ఇస్తారో ఇయ్యరో... ఇచ్చినా ఇంత మంచిసార్లు పడతారో పడరో... ఎట్లరా నాయనా నువ్వు పాసయ్యేది'' అని వాన్ని పట్టుకోని పట్టుకోని ఏడ్చినాడు. ఆ తరువాతేమయిందో గానీ కొద్ది రోజులకల్లా జరిగిపోయిన పరీచ్చలేవీ లీక్‌ కాలేదని, జరగబోయేవి మాత్రమే లీకయినాయని చెప్పి వాటిని మాత్రం మార్చి, ఆ మూడు పరీచ్చలు పెట్టేసినారు. ఆ పరీచ్చల్లో నేనూ, జనార్దన్‌ గాడూ ఫస్లు క్లాసులో పాసయితే రాబర్టుగాడు మాత్రం సెకండు క్లాసు. 
ఇది మా సంగతయితే మా చలపతిగాడు వేరే సెంటర్‌లో పరీచ్చలు రాసినాడుగదా... ఆడ యమా స్ట్రిక్టంటా... దాంతో వాడు అన్నిట్లో ఆడికాడికి మార్కులు తెచ్చుకోని పాసయినా లెక్కల్లో మాత్రం కొండెక్కేసినాడు. వానికి కోపమొచ్చేసి ''కంపార్ట్‌మెంట్‌'' అని పడితే ఏం మర్యాదుంటాదని వద్దు వద్దాన్నా వినకుండా మల్లా అన్నీ కట్టేసినాడు. పరీచ్చలకు ముందు మిద్దెపైన లైటేసుకున్నాడు చదవనీకె. కానీ అప్పుడే వాని ఖర్మకొద్దీ ఎదురింటి మిద్దెపైన ఓ అప్సరస లైటేసింది. దాంతో వాడు కిందికీ మీదికీ ఆ పిల్లనే చూస్తా తెగ స్టడీ చేసినాడు. ఆ పిల్లయితే పల్లేదు గానీ ఆ దెబ్బకు ఈ సారి తెలుగొక్కటి పాసై మిగతావన్నీ కొండెక్కేసినాయి. పాపం మా చలపతిగాడు గజనీ మహమ్మద్‌ లెక్క చానాసార్లు ప్రయత్నించినాడు గానీ గజం కూడా దాటలేక ఆఖరికి పరీచ్చలే రాయడం మానేసుకున్నాడు.
**********
కామెంట్‌లు