శ్రీ మద్రమారమణ గోవిందా హరీ - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 ఒకూర్లో ఒక హరిదాసు వుండేటోడు. ఆయన కథ చెబుతున్నాడంటే చాలు జనాలు ఎంత పనున్నా సరే... ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తుకోని వచ్చేటోళ్ళు. చుట్టుపక్కల ఊళ్ళలో అంత బాగా చెప్పేటోళ్ళు ఎవరూ లేరు. అతను హరికథ చెబుతా చెబుతా మధ్యలో చిన్న చిన్న పిట్టకథలతో జనాలను పడీపడీ నవ్వించేటోడు. ఇక పాటలైతే... వద్దులే... అమృతం తాగినంత మధురంగా వుండి జనాలు ఆనందంతో వూగిపోయేటోళ్ళు. అందరూ ఆయన్ని 'పెద్దసామి' అని పిలుచుకొనేటోళ్ళు
ఆ హరిదాసుకి ఒక కొడుకు వున్నాడు. తండ్రి ఎంత గొప్పోడో వాడు అంత పనికిమాలినోడు. పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. కానీ ఒట్టి మాటల పుట్ట. నోరు తెరిస్తే చాలు అన్నీ అబద్దాలే. అందరి ముందూ తాను గూడా నాన్నలాగే గొప్ప పండితున్నని గొప్పలు చెప్పుకుంటా తిరుగుతుండేటోడు. జనాలకు వాని సంగతి తెలీక అది నిజమేనని అనుకునేటోళ్ళు,
ఆ ఊరికి దగ్గర్లోనే కందనవోలు అని ఒక ఊరుంది. వాళ్ళు ప్రతి దసరాపండుగకు నవరాత్రులప్పుడు చివరి నాలుగురోజులు పెద్దసామితో కథలు చెప్పించుకోని రోజుకో వెయ్యి ఇచ్చేటోళ్ళు. కానీ ఆ సంవత్సరం అనుకోకుండా పెద్దసామికి జ్వరమొచ్చి మంచం మీద నుండి లేవలేకపోయినాడు. దాంతో జనాలు ఆయన కొడుకు దగ్గరకు పోయి "చిన్నసామీ... చిన్నసామీ... ఇప్పటికిప్పుడు ఇంకొకరిని వెదుక్కోడం చానా కష్టం... పండగనాడు కథలు చెప్పించడం మా తాత
ముత్తాతల నుంచీ వస్తావున్న ఆచారం. ఈసారి చెప్పించలేకపోతే మా మర్యాద పోతాది... ఎట్లాగైనా సరే మీ నాయన బదులు నీవే వొచ్చి హరికథలు చెప్పి గండం గట్టెక్కించాల. అదీగాక నీవు మీ నాయనకన్నా గొప్ప పండితునివంట గదా... ఊరు ఊరంతా చెప్పుకుంటా వున్నారు" అన్నారు. ఆ మాటలకు చిన్నసామి గొంతులో వెలక్కాయ పన్నట్టయింది. వాళ్ళ నుంచి తప్పించుకోలేక చివరికి 'సరే' అన్నాడు.
నవరాత్రులు మొదలయినాయి. చిన్నసామి హరికథలు చెప్పడం ఎట్లా ఎగ్గొట్టాల్నా అని ఆలోచిస్తా ఆ ఊరికి పోయినాడు. చిన్నసామి కథ చెబుతున్నాడంట గదా... ఎట్లుంటాదో ఏమో... అదీగాక తండ్రిని మించిన తనయుడంట గదా... అని ఆ ఊరోళ్ళే గాక చుట్టుపక్కల ఊరోళ్ళు గూడా ఎక్కడి పనులక్కడ వదిలేసి సంబరంగా గుంపులు గుంపులుగా వచ్చి కూచున్నారు. చిన్న సామి పెద్ద మాటల మాయగాడు గదా... దాంతో వాళ్ళందరినీ చూసినా ఏ మాత్రం బెదపడకుండా.... రామాలయం కట్టమీదికెక్కి అందరినీ ఒక్కసారి చూసి"శ్రీ మద్రమారమణ గోవిందా... హరీ... భక్తులారా ఈ రోజు నేను వృత్తాసుర వధ అనే కథ చెప్పబోతా వున్నా... మీకెవరికైనా ఆ కథ తెలుసా" అంటా గట్టిగా అడిగినాడు.
వృత్తాసురుడెవరో తెలీక జనాలంతా "మాకు తెలీదు సామీ" అంటా గట్టిగా అరిచినారు.
దానికి చిన్న సామి కోపంగా "ఛ... ఛ... ఇంతకాలమైనా మీరు ఆ కథ తెలుసుకోలేదంటే ఇప్పుడు మాత్రం చెప్పి ఏం లాభం... అనవసరంగా మీ సమయం వృథా... నా సమయం వృథా... పోయొస్తా" అంటా వాళ్ళ దగ్గర వేయి రూపాయలు తీసుకొని సక్కగా వెళ్లి పోయినాడు.
ఆ మాటలకు ఏం చేయాల్నో తెలీక జనాలంతా నోళ్ళు వెల్లబెట్టినారు.
తరువాత రోజు మరలా చిన్న సామి హరికథ చెప్పడానికి తయారై వచ్చినాడు. జనాలంతా ముందురోజులాగే ఈ రోజు ఏం జరుగుతాదో చూద్దామని గుంపులుగుంపులుగా వచ్చినారు. చిన్నసామి వాళ్ళందరినీ ఒకసారి అటూ యిటూ కిందికి మీదికి చూసి "శ్రీమద్రమారమణ గోవిందా... హరీ... భక్తులారా... ఈరోజు నేను నరకాసుర వధ అనే కథ చెప్పబోతా వున్నా... మీకెవరికైనా ఈ కథ తెలుసా" అంటా గట్టిగా అడిగినాడు.
ముందురోజు తెలీదని చెబితే చెప్పకుండా పోయినాడు గదా... దాంతో జనాలంతా మూకుమ్మడిగా “మాకు తెలుసు సామీ" అంటా గట్టిగా ఒక్కరుపు అరిచినారు.
దానికి చిన్నసామి చిరునవ్వు నవ్వి “భక్తులారా... తెలిసిన కథనే మరలా చెప్పడం ఎందుకు. అనవసరంగా మీ సమయం వృథా.... నా సమయం వృథా... పోయొస్తా" అంటా వెయ్యి రూపాయలు తీసుకొని మళ్లీ సక్కగా వెళ్ళిపోయినాడు.
ఆ మాటలకు ఏం చేయాల్నో తెలీక జనాలంతా మళ్ళీ నోళ్ళు వెల్లబెట్టినారు.
ముచ్చటగా మూడో రోజు చిన్నసామి మరలా హరికథ చెప్పడానికి బాగా తయారై వచ్చినాడు. జనాలంతా ఈ రోజు ఏం జరుగుతాదో చూద్దామని మరలా గుంపులు గుంపులుగా వచ్చినారు. చిన్న సామి అందరి వంకా చూస్తా "శ్రీమద్రమారమణ గోవిందా... హరీ... భక్తులారా ఈ రోజు నేను రావణవధ అనే కథ చెప్పబోతా వున్నా... మీకెవరికైనా ఆ కథ తెలుసా" అంటా గట్టిగా అడిగినాడు.
మొదటి రోజు తెలీదని చెబితే చెప్పకుండా వెళ్ళిపోయినాడు. రెండవ రోజు తెలుసని చెప్పినా చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఎట్లాగబ్బా వీనితో అని జనమంతా ముందే మాట్లాడుకోని సగం మంది “మాకు తెలుసు సామీ" అని అరిస్తే మిగతా సగం మంది "మాకు తెలీదు సామీ" అని అరిచినారు.
చిన్నసామి చిరునవ్వు నవ్వి “భక్తులారా... హాయిగా తెలిసినవాళ్ళు తెలియనివాళ్ళకు చెప్పండి. అట్లాగే తెలియని వాళ్ళు తెలిసినవాళ్ళతో అడిగి చెప్పించుకోండి. ఆ మాత్రం దానికి నేనెందుకు. అనవసరంగా మీ సమయం వృథా... నా సమయం వృథా... పోయెస్తా..." అంటా వేయిరూపాయలు తీసుకోని సక్కగా వెళ్ళిపోయినాడు.
దాంతో ఊరోళ్ళందరికీ చిన్నసామి గురించి అర్థమైపోయింది. “రేయ్... మనం చిన్న సామంటే ఏమో అనుకున్నాంగానీ వీడు ఉత్త మాటల మాయగాడు. ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి ఏసి తప్పించుకోని తిరుగుతా వున్నాడు. ఇప్పటికే ఏమీ చెప్పకుండా ఉత్తపుణ్యానికి మూడువేలు నున్నగా నూకేసినాడు. వీని సంగతి చూసుకోవలసిందే" అనుకున్నారు.
తరువాత రోజు ఎప్పటి లాగే చిన్నసామి సంబరంగా వూగులాడతా వచ్చినాడు. జనాలంతా గుంపులు గుంపులుగా వచ్చి కూచున్నారు. అంతలో ఆ ఊరి పెద్ద ఇంత లావు కట్టె ఒకటి చేతిలో పట్టుకోని చిన్నసామి దగ్గరికి వచ్చి "శ్రీమద్రమారమణ గోవిందా... హరీ... సామీ మీరెప్పుడయినా హరిదాసు వధ అనే కథ విన్నారా" అని అడిగినాడు గట్టిగా.
ఆ మాటలకు చిన్న సామి అదిరిపడి "హరిదాసు వధా... ఆ కథ ఎప్పుడూ వినలేదే" అన్నాడు కంగారుగా,
దానికి ఆ ఊరి పెద్ద "సామీ... మరియాదగా మా దగ్గర కొట్టేసిన మూడువేలు మాకిస్తివా సరి... లేకపోతే ఆ కథ చెప్పం. ఏకంగా ఇక్కడే ఇప్పుడే అందరి ముందు నాటకం ఏసి చూపిస్తాం" అన్నాడు కట్టె పైకెత్తి.
అంతే... చిన్నసామి అదిరిపడి గజగజగజ వణికిపోతా “ఓరినాయనోయ్... ఈ ఊరోళ్ళు అమాయకులని అనుకుంటిని గానీ... నన్ను మించిపోయినట్టున్నారు" అనుకుంటా బెరబెరా డబ్బులు తీసి వాళ్ళ చేతిలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినాడు.
***********
కామెంట్‌లు