సుప్రభాత కవిత ; - బృంద
ప్రభవించు ప్రభాకరుని
ప్రభల ప్రబల ప్రకాశము
ప్రసరించు ప్రతి ప్రదేశమూ
ప్రభావంతమై ప్రజ్వలించగా

కాంచన గంగలా పొంగి
అంచెలంచెలుగా సాగి
అంబరమంతా వెలిగించి
సంబరంలో ముంచి

కనక మయ కిరణాల
కరుణ ప్రసరించి
అవనిని అపరంజిగా
మనో రంజకముగా మార్చి

జీవితేచ్ఛ కలుగ జీవులన్నిటినీ
చైతన్యపరచి  చేయూతనిచ్చి
సాగుదారిని కంటకములు
కళ్ళపడునట్లు చేసి తప్పించి

జగతిని జాగృత పరచి
జనపదాలకు జలసిరులిచ్చి
జనుల జీవనము కొరకు
వలయు సౌకర్యమిచ్చి

ప్రతిదినము నీమముగ
తరలివచ్చి తరింపచేసి
ప్రతి గడప పచ్చగ 
వెలిగించు వేలుపు రాకకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు