తెలుగులో విద్యాబోధన- సి.హెచ్.ప్రతాప్
 మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. ప్రపంచంలో మాట్లాడే భాషలన్నిటికంటే మనం మన వ్యక్తిగత ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడుతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో పాఠశాల్లో తోటి విద్యార్థులతో మాట్లాడుతామో అదే మన మాతృభాష. ఆ భాషే మన భావోద్వేగాల అభివృద్ధికీ, జ్ఞానాభివృద్ధికీ ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది. మాతృభాషలో విద్యా బోధన వల్ల విద్యార్థికి బోధన అంశం సమగ్రంగా అర్థమవుతుంది. నైపుణ్యాలు పెరుగుతాయి. మాతృభాషలో అభ్యసనం విద్యార్థులకు వినయవిధేయతలు అందిస్తుంది. ఐక్యరాజ్యసమితి 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ స్వదేశీ భాషల సంవత్సరంగా ప్రకటించింది. కనుమరుగయ్యే స్థితిలో ఉన్న భాషలను పరిరక్షించుకోవాలన్నది దానర్థం. మాతృభాషలో బోధించడం అంటే పిల్లలకు వాళ్ళ జాతి సంస్కృతుల్ని గూర్చి తెలియజెప్పటమే అంటున్న పరిశోధకులు, భాషాశాస్త్రజ్ఞుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని,పాఠశాలలో బోధన అభ్యసన పద్ధతులు, విధి విధానాలను రూపొందించే విషయంలో ప్రభుత్వాలు జాతి మనుగడపై దృష్టిసారించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ఆలోచించి సహకరించాలి.మాతృభాషా మాధ్యమానికి ప్రాధాన్యతనిస్తూ దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసి మాతృభాషా మాధ్యమంలోనే విద్యా బోధన జరిగేటట్లు ప్రభుత్వం, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాతృభాషలు మనగలుగుతాయి. లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. మన మాతృభాషయైన తెలుగును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనం మన మాతృభాష తెలుగుకు సంబంధించి సంధి దశలో ఉన్నాం. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే పరిస్థితి చేయి దాటిపోక తప్పదు. పద సంపదను, సాహితీ సొబగులను, వ్యాకరణ పారిజాతాలను, పలుకుబడులను పట్టించుకోకపోతే వాటి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది
కామెంట్‌లు