సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -428
ఋతుమతీకన్యకా న్యాయము
******
ఋతుమతీ కన్యక అనగా  వివాహానికి యోగ్యమైన బాలిక.
ఋతుమతీ కన్యక వివాహానంతరం  తల్లిదండ్రుల మీద నుండి దృష్టి మరల్చి భర్తపై అనురాగము,ప్రేమ చూపుతూ సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతుంది‌ అని అర్థము.
 వివాహానికి ముందు అమ్మాయి తల్లిదండ్రులే దైవమని భావిస్తుంది.వారి ప్రేమ అనురాగం ఆప్యాయతలను పొందుతుంది.ఇంకా ఇంకా పొందాలని తహతహ లాడుతుంది.
అలాంటి అమ్మాయి వివాహం అయ్యాక పూర్తిగా మారిపోతుంది. తాను పొందిన,పొందాలనుకున్న ప్రేమాభిమానాలు,అనురాగాన్ని, ఆప్యాయత ,ఆత్మీయతను  భర్తకు ,భర్త తరఫు వారికి అందిస్తుంది.వారి నుండి కూడా పొందాలని కోరుకుంటూ వుంటుంది. సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తుందని చెప్పడమే ఈ న్యాయములో పైకి కనబడే సామాన్యమైన లేదా భౌతిక అర్థమని  ఆధ్యాత్మిక వాదులు  అంటారు.
 వారి దృష్టిలో ఈ  న్యాయము యొక్క అంతరార్థం "మనసు పరిపక్వత చెందిన వ్యక్తి  ఎప్పుడైతే భగవంతుని యందు మనో వాక్కాయములను నిల్పుతాడో అతడు ఆత్మానందం పొందుతాడని అర్థము.
 మనసు పరిపక్వత చెందడమంటే ఏమిటి? అనే ప్రశ్న మనలో తప్పకుండా ఉదయిస్తుంది. ఇక్కడ ఐహిక సుఖాల మీద ఇచ్ఛ నశించి ఆధ్యాత్మికత వైపు మనసు మరలడమే మనసు పరిపక్వత చెందడమని అర్థము.
ఆధ్యాత్మికత అంటే చాలా మంది  జీవితంలో అన్నీ వదిలేసిన సన్యాసి లాంటి వారు ఆచరించేది అనుకుంటారు.బతుకు మీద ఏ ఆసక్తి ,ఆశలు లేని వారే భగవంతుని వైపు దృష్టి మరలుస్తారని అంటుంటారు.
వాటిల్లో ఎలాంటి నిజం లేదనీ, ఆధ్యాత్మికత అనేది ఒక దిశానిర్దేశం అని ఆధ్యాత్మిక వాదుల ఖచ్చితమైన అభిప్రాయం.ఇక ఆధ్యాత్మిక పరిపక్వత అంటే మతాలకు అతీతంగా ఆలోచించగలగడం.ఆ  ఆలోచనా,ఆ చింతన ద్వారా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దానిని దిశగా పయనించడం.
 అమ్మ నాన్న కుటుంబ సభ్యుల బంధాలతో ముడిపడి వారి ప్రేమానురాగాల కోసం వెంపర్లాడే 'నేను' అనే వ్యక్తి  ఆ అమాయక బంధాల,అనుబంధాల వలలోంచి  బయటపడి "నేను అనగా ఎవరు? అని తెలుసుకోగలగడం ఆధ్యాత్మికత ఐతే దానికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని తెలుసుకోగలగడమే ఆధ్యాత్మిక పరిపక్వత.
 ఇలా ప్రతి న్యాయమును భౌతిక దృష్టితో  చూపి ఒక అర్థమునూ,ఆధ్యాత్మిక దృష్టితో చూపి మరొక అర్థమును చెప్పగలిగిన మన  పెద్దవాళ్ళ జ్ఞాన సంపద,సముపార్జన ఎంత గొప్పదో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
  ఇక మనం భౌతికమా? ఆధ్యాత్మికమా? అనే విషయాన్ని పక్కనపెట్టి  మనలో రావాల్సిన మానవీయ విలువల పరిపక్వత గురించి ఆలోచిద్దాం. ఆ దిశగా పయనించి మనీషిగా జీవితాన్ని కొనసాగిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు