ఆవాహయామి- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కుందుర్తీ ఆవహించరాదా
వచనకవితల వరదపారింపచేయరాదా!

కృష్ణశాస్త్రి కలములోదూరరాదా
భావకయితలను బుర్రలకుచేర్పించనీయరాదా!

పాపయ్యశాస్త్రీ పురమాయించరాదా
పుష్పకవనాలను పెక్కుపుటలకెక్కింపజేయరాదా!

శ్రీశ్రీ పూనరాదా
విప్లవకైతలవాన కురిపించరాదా!

నండూరీ ఆవేశపరచరాదా
వెంకిశైలిపాటలు విరివిగావ్రాయించరాదా!

ఆత్రేయా అంతరంగంలోప్రవేశించరాదా
మనసుకయితలతో మరీమరీమురిపింపజేయనీయరాదా!

శ్రీనాధా మదినితొలచరాదా
శృంగారరసాన్ని చదువురలపైచిలికింపజేయరాదా!

సినారే శిరసునాక్రమించరాదా
పలుప్రక్రియలలో పాఠకులనుపులకరింపజేయనీయరాదా!

దాశరధి దర్శనమివ్వరాదా
రగడలురుబాయీలను రాతలలోపెట్టించిరంజింపజేయరాదా!

తిలకుమహాశయా తలనుతట్టరాదా
అమృతాన్ని అధరాలకందింపజేయరాదా!

సిరివెన్నెలశాస్త్రీ చిత్తానిచిలకరాదా
పదపయోగాలతోప్రాసలతో పసందైనపాటలురాసిపాడించరాదా!

కామెంట్‌లు