సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం.
 న్యాయాలు-446
కాంస్య భోజి న్యాయము
*****
కాంస్యము అనగా కంచు, పాన పాత్రము.భోజి అనగా భుజించువాడు, తినేవాడు.
శిష్యుడు, గురువుల నియమ నిష్టల వల్ల వచ్చే యిబ్బందులను గురించి చెప్పడమే ఈ న్యాయము లోని ముఖ్య ఉద్దేశ్యం. అదేంటో చూద్దామా.
"నేను ప్రతిరోజూ గురువు గారు భుజించగా మిగిలిన దానిని భుజింప వలయును.అది కూడా కంచు కంచంలో" అనే నియమం పెట్టుకున్న శిష్యుని బట్టి  అతడి గురువు కంచు కంచంలో భుజిస్తాడని తెలుస్తోందనీ.
ఇందులో వున్న మరో చమత్కారం కూడా చూద్దాం. ఒకవేళ గురువు గారు "ఏ కంచంలోనూ తినకూడదని,అందులోనూ ముఖ్యంగా కంచు కంచం పూర్తిగా నిషిద్ధం" అనే నియమం  పెట్టుకుంటే,ఆ గురువు వద్ద విద్య అభ్యసించే శిష్యుడి పరిస్థితి ఏమిటి?
గురువు నియమము పాటిస్తే శిష్యుని నియమమునకు, శిష్యుని నియమము పాటిస్తే గురువు నియమానికి భంగము వాటిల్లుతుంది. ఇలా పరస్పరం పెట్టుకున్న నియమము వల్ల ఏది పాటించినా మరొకరికి బాధ కలగక తప్పదు.
 ఇలా ఒకరి ఇష్టము మరొకరికి కష్టంగా మారడమంటే ఇదే.
ఈ న్యాయము గురు శిష్యులను ఉద్దేశించి చెప్పారు కానీ ఇంకా కలిసి కాపురం చేస్తున్న భార్యాభర్తల మధ్య, స్నేహితులు, బంధువుల మధ్య కూడా ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయనేది మనందరికీ తెలిసిందే. 
 భర్త ఇష్టాలు భార్యకు, భార్య ఇష్టాలు భర్తకు నచ్చక పోవచ్చు.తాము పెట్టుకున్న నియమాలను ఉల్లంఘించడానికి ఇద్దరిలో ఎవరూ ఇష్టపడనప్పుడు సమస్య జటిలంగానే వుంటుంది.
ఇలాంటివి బంధువులు స్నేహితుల మధ్య కూడా వచ్చినప్పుడు సర్థుకు పోతే సమస్యే లేదు కానీ, "నేనింతే, నేనిలాగే వుంటాను" అనుకుంటే మాత్రం అభిప్రాయ భేదాలు,అనవసర పట్టింపులు మొదలై వారి మధ్య  అప్పటి వరకు ఉన్న  బంధాలు, అనుబంధాలు బీటలు వారి పోయే ప్రమాదం ఉంది.
"కాంస్య భోజి న్యాయము" ద్వారా ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏమిటంటే  ఒకరికొకరు కలిసి మెలిసి ఆనందంగా జీవించాలి అనుకుంటే చిన్న చిన్న త్యాగాలు,నియమాల సడలింపులు, సర్థుకుపోవడాలు తప్పకుండా వుండాలి. అలా కాకుండా నియమాలు,నిషిద్ధము లంటూ పట్టుకు వేలాడితే... పరస్పరం పెట్టుకున్న నియమాల వల్ల బాధలు తప్పవు.
 
మానవీయ బంధాలు కలకాలం నిలవాలంటే "కాంస్య భోజి న్యాయము"ను తప్పకుండా సడలించుకోవాలనేది దీని ద్వారా మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు