బదిలీ టీచర్ కు వీడ్కోలు సన్మానం

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు బదిలీ అయిన సందర్భంగా, వారి సేవలను కొనియాడుతూ, ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. 
ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తిరుమలరావును శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపిక, ఫలతాంబూలాలు, కానుకలతో ఉపాధ్యాయులంతా ఘనంగా సన్మానించారు. 
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయని నాగమణి మాట్లాడుతూ ప్రతీరోజూ అదనపు తరగతులను నిర్వహిస్తూ, విద్యార్థులకు కనీస అభ్యసన స్థాయి చేకూరేలా కృషి చేసిన తిరుమలరావు, ఉపాధ్యాయ లోకానికి ఆదర్శప్రాయులని అన్నారు. ఉపాధ్యాయని పాలవలస శారదాకుమారి మాట్లాడుతూ విద్యార్థులకు చదువులతో పాటు క్రమశిక్షణ అలవడేలా నిరంతరం తిరుమలరావు శ్రమించారని అన్నారు. ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ మాట్లాడుతూ బాలబాలికలకు గుణాత్మక విద్యాసాధన అందించుటే లక్ష్యంగా తిరుమలరావు బోధించారని, పలుసార్లు విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ జ్ఞాపికలు, మెడల్స్ వంటి బహుమతులనిచ్చీ మిగతా విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించారని అన్నారు. ఉపాధ్యాయని దానేటి పుష్పలత మాట్లాడుతూ గురుబ్రహ్మల వ్యవస్థకు విలువ పెంచేలా తిరుమలరావు విలువలతో కూడిన కర్తవ్య నిర్వహణ గావించుచున్నారని అన్నారు. 
ఉపాధ్యాయులు సిద్ధాబత్తుల వెంకటరమణ మాట్లాడుతూ తిరుమలరావు చక్కని చేతివ్రాత అలవడేలా తర్ఫీదునిచ్చి దస్తూరీగా రాసేలా చేసారని, పాటలతో పాటు చిత్రలేఖనం నేర్పించారని, ఉక్తలేఖనం, పఠనపోటీలు, మున్నగునవి నిర్వహించి విద్యా ప్రమాణాలు పెంపొందించారని మిక్కిలి ప్రశంసించారు. 
విద్యార్ధిణులు దూసి శ్రావ్య, సాహుకారు సాయివర్ష తదితరులు తమ ప్రసంగాలలో గుణాత్మక బోధనలు గైకొని అవగాహనతో కూడిన అభ్యసనం గావించారని కృతజ్ఞతలు తెలిపారు. 
సన్మాన గ్రహీత కుదమ తిరుమలరావు మాట్లాడుతూ స్నేహభావంతో ఉపాధ్యాయులంతా తననెంతో గౌరవించారని, విద్యార్థులంతా తనపట్ల పూజ్య భావంతో మెలిగారని, ఘనసన్మానం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత తిరుమలరావు కొత్తూరు మండలం కడుము హైస్కూల్ లో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తుండగా ఆరున్నర నెలల క్రితం వర్క్ ఎడ్జిస్ట్ మెంట్ డెప్యుటేషన్ బదిలీపై వచ్చి నేడు రిలీవ్ ఐనారు. విద్యాసంవత్సరం ముగింపు రోజున అధికారుల నిర్దేశాలమేరకు తిరిగి కడుము ఉన్నత పాఠశాలలో తిరుమలరావు నేడు చేరనున్నారు.
కామెంట్‌లు